● జిల్లాలో 4 కేసులు నమోదు
● దుబ్బాక నియోజకవర్గంలోనే 3
● మూలనపడ్డ ఫాగింగ్ మెషీన్లు
దుబ్బాకలో ఇంటి
పరిసరాలలో చేరిన మురికి నీరు
దుబ్బాకటౌన్: జిల్లాలో డెంగీ డేంజర్ బెల్స్ ప్రారంభమయ్యాయి. వర్షాలు జోరుగా కురుస్తుండటంతో దోమల వ్యాప్తి సైతం తీవ్రంగా పెరిగింది. దీంతో సీజనల్ వ్యాధులు తాండవమాడుతున్నాయి. ప్రజలు పలు రకాల జ్వరాలతో వైద్యం కోసం వస్తుండటంతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.
నాలుగు డెంగీ కేసులు నమోదు
సిద్ధిపేట జిల్లాలో ఇప్పటివరకు 4 డెంగీ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలోనే మూడు కేసులు నమోదయ్యాయి. దౌల్తాబాద్ తాండలో 2, దుబ్బాక ఒకటి, మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తి డెంగీతో జిల్లా ఆస్పత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. రోగులు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం దుబ్బాకలో యువకుడికి డెంగీ పాజిటివ్ రావడంతో మున్సిపల్ కమిషనర్ మహేశ్ కుమార్, చైర్మన్ సంగీత ఇంటి పరిసరాలలో దోమల నివారణ మందును పిచికారీ చేయించారు.
పారిశుద్ధ్యంపై పట్టింపేది
ప్రజా పాలనలో పారిశుద్ధ్యం కరువైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. మురికి కాలువలు, వర్షాకాలంలో పెరగిన పిచ్చి మొక్కలు తొలగించడం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వినికిడి. దీంతో దోమలు, ఈగలు తీవ్రస్థాయిలో వ్యాప్తి చెంది సీజనల్ వ్యాధులకు దారి తీస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. పెంట కుప్పలపై, గడ్డి పొదల్లో, మురికి కాలువల్లో దోమల వ్యాప్తి పెరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఫాగింగ్ మెషీన్లు పని చేయక మూలనపడుతున్న వాటిని కనీసం మరమ్మతులు చేయించడం లేదని ప్రజలు అంటున్నారు.


