ఆగస్టు నుంచి అమల్లోకి
● చిన్నారులకు ఉదయం అల్పాహారం
● పథకం అమలుకు ప్రభుత్వం శ్రీకారం
● 55,200 మంది చిన్నారులకు లబ్ధి
సిద్దిపేటరూరల్: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా శైశవ దశ నుంచే చిన్నారుల్లో పౌష్టికాహార లోపాలు లేకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రభుత్వం తొలిముద్ద పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద అమలవుతున్న ఈ పథకాన్ని ఈ నెల నుంచి అన్ని జిల్లాల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులోభాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఉదయం అల్పాహారాన్ని అందించనున్నారు.
55,200 మంది చిన్నారులకు ప్రయోజనం
ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 1,150 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వారిలో ఏడాది వయస్సులోపు చిన్నారులు 10,712మంది ఉన్నారు. మూడేళ్లలోపు వయస్సున్న పిల్లలు 22,633మంది, మూడేళ్ల నుంచి ఐదేళ్ల వయస్సున్న పిల్లలు 21,855మంది ఉన్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్న తొలిముద్ద పథకం కింద జిల్లాలో 55,200 మంది చిన్నారులకు ప్రయోజనం కలగనుంది. వీరంతా తొలిముద్ద పథకం ద్వారా మరింత ఆరోగ్యవంతు లుగా అయ్యేందుకు అవకాశం ఉంది.
ప్రభుత్వం చేపడుతున్న తొలిముద్ద పథకాన్ని ఈ నెల నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అయితే జిల్లాకు ఇప్పటివరకు స్పష్టమైన ఆదేశాలు రాలేదు. వచ్చిన వెంటనే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
–శారద, జిల్లా సంక్షేమశాఖ అధికారి


