ప్రధానోపాధ్యాయుడిపై గ్రామస్తుల ఆగ్రహం
నంగునూరు(సిద్దిపేట): ఉపాధ్యాయుల మధ్య నెలకొన్న వర్గ పోరుతో విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని గురువారం నంగునూరు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గణిత ఉపాధ్యాయుడి డిప్యూటేషన్ రద్దు చేయకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పాలమాకుల ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రమణారెడ్డిని బద్దిపడగకు, అక్కడ పని చేస్తున్న యాదయ్యను పాలమాకులకు డిప్యూటేషన్ వేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. చక్కగా పాఠాలు బోధించే రమణారెడ్డిని రిలీవ్ చేయవద్దని విద్యార్థులు చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో గ్రామస్తులకు తెలిపారు. సర్పంచ్ ఓజాలు ఆధ్వర్యంలో యువకులు పాఠశాలకు చేరుకుని హెచ్‌ఎం ప్రభాకర్‌రావుని నిలదీశారు. ఉపాధ్యాయుల మధ్య నెలకొన్న వివాదంతో నచ్చని వారిని డిప్యూటేషన్‌పై పంపుతున్నారని హెచ్‌ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఈఓకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని మండిపడ్డారు. విద్యార్థుల కోరిక మేరకు డిప్యూటేషన్ రద్దు చేస్తామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెచ్‌ఎం ప్రభాకర్‌రావు ఉపాధ్యాయులపై వివక్ష చూపుతున్నారని గతంలోనే ఆయనపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవ్వగా కొందరు నచ్చ చెప్పడంతో ఫిర్యాదు చేయలేదని యువకులు తెలిపారు. రాజగోపాల్‌పేట పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్తులను సముదాయించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యపై డీఈఓకు ‘సాక్షి’ పలుమార్లు ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు.


