జీరో వేస్ట్‌మేనేజ్‌మెంట్..
స్వచ్ఛ దిశగా
● మున్సిపాలిటీకో వార్డు పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక
● పూర్తిస్థాయిలో జీరో వేస్ట్ మేనేజ్‌మెంట్, కంపోస్ట్ కార్యక్రమాలు
● విజయవంతం కాగానే అన్ని వార్డుల్లో అమలు
● త్వరలోనే అన్ని మున్సిపాలిటీల్లో శ్రీకారం
కొత్త తరహాలో
స్వచ్ఛ కార్యక్రమాలు
మున్సిపాలిటీల్లో కొత్త తరహాలో స్వచ్ఛ కార్యక్రమాలు జరగనున్నాయి. ఎస్‌ఐఆర్ కార్యక్రమం పూర్తవగానే ఓ వార్డును పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి జీరోవేస్ట్ మేనేజ్‌మెంట్ కార్యక్రమాలను చేపట్టాలనుకుంటున్నాం. పారిశుద్ధ్య అధికారులు, సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే. అయినా అందుబాటులో వారితో కార్యక్రమాలు జరిగేలా ప్రయత్నిస్తాం.
– గణేశ్‌రెడ్డి, కమిషనర్,
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్
గజ్వేల్: మున్సిపాలిటీల్లో వ్యర్థాల నిర్వహణ తీరు ప్రజారోగ్యానికి ముప్పుగా మారింది. తడి, పొడి చెత్త సేకరణ శాసీ్త్రయంగా జరగకపోవడం వల్ల ఈ సమస్య రోజురోజుకూ జఠిలంగా మారుతోంది. ఈ క్రమంలోనే కొత్త పంథాలో చెత్త సేకరణ చేపట్టడమే కాకుండా జీరో వేస్ట్ మేనేజ్‌మెంట్, కంపోస్ట్ కార్యక్రమాలను చేపట్టాలని మున్సిపల్ యంత్రాంగం భావిస్తున్నది. ఈ క్రమంలోనే ఈనెల 9న గజ్వేల్‌లోని డంపు యార్డు వద్ద జిల్లాలోని గజ్వేల్–ప్రజ్ఞాపూర్, సిద్దిపేట, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలతోపాటు అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట కమీషనర్లు, శానిటేషన్ అధికారులు, సిబ్బందితో మున్సిపల్ సీడీఓ(కంపోస్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్) హేమలత ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త తరహా పద్ధతులపై దిశానిర్వేశం చేశారు.
సిబ్బంది కొరతే శాపమా?
పారిశుద్ధ్య విభాగాలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది కొరత ఆయా మున్సిపాలిటీలకు శాపంగా మారాయి. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా ఏర్పడిన ఆర్‌అండ్‌ఆర్ కాలనీలతో కలుపుకొని 15వేలకుపైగా ఇళ్లు ఉండగా.. జనాభా 80వేల పైచిలుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ నిత్యం ఉత్పత్తి అవుతున్న చెత్త 18 మెట్రిక్ టన్నుల పైనే. ఇక్కడ ప్రస్తుతం 162మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు. నిజానికి మరో 60మందికిపైగా సిబ్బంది అవసరం. ఇక్కడ 30 వరకు చెత్త సేకరణ వాహనాలు ఉండగా, మరో పది వాహనాలు అవసరమున్నాయి. మరో ముఖ్యమైన అంశమేమిటంటే పారిశద్ధ్య సమస్యను పర్యవేక్షించాల్సిన శానిటరీ ఇన్‌స్పెక్టర్, ఎన్విరాన్‌మెంట్ ఇన్‌స్పెక్టర్, హెల్త్ అసిస్టింట్, ఏఈల పోస్టులు కొంత కాలంగా ఖాళీగా ఉన్నాయి. హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీల్లోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో కొత్తగా చేపట్టబోయే కార్యక్రమాలు ఏమేరకు ఫలిస్తాయనేది వేచి చూడాల్సిందే.
మున్సిపాలిటీలకు సవాలుగా మారిన వ్యర్థాల నిర్వహణ కొంత పుంతలు తొక్కనుంది. పాత పద్ధతులకు స్వస్తి పలికి కొత్త తరహాలో స్వచ్ఛత కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందుకోసం మున్సిపాలిటీకో వార్డును పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేయనున్నారు. జీరో వేస్ట్ మేనేజ్‌మెంట్, కంపోస్ట్ కార్యక్రమాలను విజయవంతం చేయడం ద్వారా మిగతా వార్డుల్లో అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమం త్వరలో అమలు కానుంది.
వ్యర్థాల నిర్వహణలో కొత్త పంథా
ఈ సదస్సులో మున్సిపాలిటీకో వార్డును పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేయాలని నిర్ణయించారు. వార్డులో పూర్తిస్థాయిలో జీరోవేస్ట్ మేనేజ్‌మెంట్, అక్కడ ఉత్పత్తయిన తడి, పొడి చెత్తను శాసీ్త్రయంగా వేరు చేసి కంపోస్ట్ ఎరువుల తయారీపై దృష్టి పెట్టాలని అనుకున్నారు. ఇలా చెత్తను రీ–సైక్లింగ్ చేయడం ద్వారా స్వచ్ఛతకు బాటలు పడతాయని భావిస్తున్నారు. ప్రధానంగా కూరగాయల చెత్తను ప్రత్యేకంగా వేరు చేసి.. కులియబెట్టడం ద్వారా కంపోస్ట్‌ను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు. అంతేకాకుండా డంపు యార్డుల్లో అగ్గి రాజుకోకుండా తీసుకోవాల్సిన శాసీ్త్రయ చర్యలపైనా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని సిద్దిపేట మున్సిపాలిటీకి ఈ కార్యక్రమాలు కొంత పరిచయమున్నా.. మిగతా మున్సిపాలిటీల్లో సాగడం లేదు. ఇక అన్నీ మున్సిపాలిటీల్లో ఎస్‌ఐఆర్ కార్యక్రమం తర్వాత ప్రారంభించాలని భావిస్తున్నారు.


