కేవైసీ.. పరేషన్‌! | - | Sakshi
Sakshi News home page

కేవైసీ.. పరేషన్‌!

Jul 13 2026 8:15 AM | Updated on Jul 13 2026 8:15 AM

ప్రహసనంగా ఐడెంటిటీ

ప్రహసనంగా ఐడెంటిటీ

జిల్లా పౌర సరఫరాల శాఖలో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. రేషన్‌ కార్డుదారుల కేవైసీ ప్రక్రియకు రెండు లక్షల మంది లబ్ధిదారులు దూరంగా ఉండటంతో నిర్దేశించిన వందశాతంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కేవైసీ చేయని వారికి రేషన్‌ సరుకుల పంపిణీ నిలిపివేయాల్సి వస్తుందని సంబంధించిన శాఖ హెచ్చరికలు చేసినప్పటికీ లబ్ధిదారుల్లో స్పందన కనబడకపోవడంతో రేషన్‌ డీలర్లు, శాఖ అధికారులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు.

– సిద్దిపేటజోన్‌

జిల్లాలోని 688 రేషన్‌ షాప్‌ల ద్వారా ప్రభుత్వం నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో 3,36,976 రేషన్‌ కార్డులు ఉండగా వీటి ద్వారా 1,04,9021 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ క్రమంలో రేషన్‌ పక్కదారి పట్టకుండా అర్హులైన వారిని గుర్తింపు నేపథ్యంలో కేవైసీ అంశం తెర మీదకి వచ్చింది. రేషన్‌ షాప్‌ వారీగా లబ్ధిదారుల బయోమెట్రిక్‌, ఐరిష్‌ ప్రక్రియ చేపట్టి వారి ఐడెంటిటీ నిర్దారణ మొదలుపెట్టారు. ఈ లెక్కన జిల్లాలో ఇప్పటివరకు 3,23,100 రేషన్‌ కార్డులకు సంబంధించి 8,48,106మంది లబ్ధిదారుల బయోమెట్రిక్‌, ఐరిష్‌ సేకరణ జరిగింది. ఇంకా 13,876కార్డులకు చెందిన 2,00,915మంది బయోమెట్రిక్‌, ఐరిష్‌ చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. వారి కోసం కొన్ని నెలలుగా రేషన్‌ డీలర్లు ఎదురుచూస్తున్నా వారిలో స్పందన నామమాత్రంగా ఉందని చెప్పాలి.

వందశాతంపై ప్రభావం..

జిల్లాలోని రేషన్‌ కార్డుదారులందరి కేవైసీ వందశాతం పూర్తి చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి సవాలక్ష కారణాలు అడ్డుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా కార్డుల్లో చిన్న పిల్లలు, వృద్ధులు అధిక సంఖ్యలో ఉండటంతో వారి బయోమెట్రిక్‌, ఐరిష్‌ ప్రక్రియ సమస్యగా మారుతోంది. అదేవిధంగా కొన్నేళ్లుగా వివిధ కారణాలతో లబ్ధిదారులు చనిపోయారు. అయినప్పటికీ వారి పేర్లను కార్డుల నుంచి తొలగింపు ప్రక్రియ లేకపోవడం, అలాగే వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్‌ నినాదంతో లబ్ధిదారులు ఎక్కడైనా సరుకులు తీసుకునే అవకాశం ఏర్పడింది. సరుకుల కోసం వచ్చిన లబ్ధిదారులు అంతే ఆసక్తిగా గుర్తింపు ప్రక్రియకు రావడం లేదు. ఇలాంటి కారణాలతో ప్రస్తుతం కేవైసీ నిర్దేశించిన లక్ష్యం పై ప్రభావం పడుతోంది. ఐడెంటిటీ ప్రక్రియకు రాకుండా రికార్డులలో పెండింగ్‌ అంశంగా ఉన్న లబ్ధిదారుల ఆచూకీ కోసం రేషన్‌ డీలర్లు నెలల కొద్దీ ఎదురుచూస్తూనే ఉన్నారు.

ఇంకా రెండు లక్షల మంది లబ్ధిదారులు దూరం

నెలలు గడిచినా స్పందన కరువు

కష్టతరంగా వందశాతం ప్రక్రియ

వెతుకులాటలో రేషన్‌ డీలర్లు

20శాతం మిగిలింది..

జిల్లాలో రేషన్‌ కార్డుల లబ్ధిదారుల కేవైసీ ప్రక్రియ నిరంతరం.. ఇప్పటివరకు 80శాతం పూర్తి అయింది. ఇంకా 20శాతం మిగిలి ఉంది. లబ్ధిదారులు తప్పనిసరిగా రేషన్‌ దుకాణానికి వెళ్లి కేవైసీ చేయించుకోవాలి.

–తనూజ, డీఎస్‌ఓ, సిద్దిపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement