సిద్దిపేట మున్సిపాలిటీ రికార్డు
ఒక్క రోజే రూ.కోటి వసూలు
సిద్దిపేట జోన్: సిద్దిపేట మున్సిపాలిటీ చరిత్రలోనే అరుదైన రికార్డు సాధించింది. ప్రభుత్వం ఇచ్చిన 5 శాతం ఇంటి పన్ను రాయితీలో ఒక్క రోజే రూ.కోటి వసూలు అయ్యింది. పన్ను రాయితీలో భాగంగా బుధవారం ఒక్క రోజే రూ.కోటి 5లక్షలు చెల్లించి ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇంటి పన్ను రూ.17కోట్లకు గాను ఇప్పటి వరకు రూ. 6కోట్ల 27లక్షలు వసూలయ్యాయి.
మానవ మనుగడకు
వేదాలు దోహదం
పీఠాధిపతి మాధవానంద సరస్వతి
వర్గల్(గజ్వేల్): మానవ మనుగడకు వేదాలు దోహదపడతాయని, వేదవిద్య సమాజాన్ని జాగృతం చేస్తుందని పీఠాధిపతి మాధవానంద సరస్వతి అన్నారు. బుధవారం అక్షయ తృతీయ విశేష పర్వదినం రోజు వర్గల్ శ్రీవిద్యాసరస్వతి క్షేత్రం సందర్శించిన పీఠాధిపతికి ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర సిద్ధాంతి పరివారం పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం వేదపాఠశాలలో స్మార్తం పూర్తిచేసుకున్న తొమ్మిది మంది విద్యార్థులకు జయపట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అనుగ్రహ భాషణం చేస్తూ వేదం అనేది విద్య మాత్రమే కాకుండా జీవన విధానమని అభివర్ణించారు. వేద విద్యార్థులు సామాజిక శ్రేయస్సుకు కృషి చేయాలన్నారు. ఉన్నతస్థాయికి ఎదుగుతూ వేదపాఠశాల లక్ష్యాలు సిద్ధింపజేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆశీస్సులు అందజేశారు.
నేలవాలిన మునగ తోట
తొగుట(దుబ్బాక): మండలంలోని వెంకట్రావుపేటలో ఈదురుగాలులకు మునగ తోట నేలవాలింది. గ్రామానికి చెందిన రైతు సుతారి ఆంజనేయులు వ్యవసాయంతో పాటు ఎకరం మునగ తోట సాగుచేశారు. బుధవారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు కాపు దశకు వచ్చిన చెట్లు విరిగి పడిపోయాయి. దీంతో తీవ్ర నష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తంచేశారు.
బసవేశ్వరుని బోధనలు అనుసరణీయం
డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి
గజ్వేల్: బసవేశ్వరుని బోధనలు అనుసరణీయమని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. బుధవారం బసవేశ్వరుని జయంతి సందర్భంగా పట్టణంలోని బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నర్సారెడ్డి మాట్లాడుతూ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి గొప్ప పరివర్తనకు బసవేశ్వరుడు నాంది పలికారని కొనియాడారు. కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, లింగాయత్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
సీఐటీయూ
పోరాట ఫలితమే
సంగారెడ్డి : సీఐటీయూ పోరాట ఫలితమే అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు వచ్చాయని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు మే నెలంతా సెలవులు ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడం సంతోషకరమన్నారు. ఇతర సేవలు అందించటం కోసం అంగన్‌వాడీ ఉద్యోగులందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంగన్‌వాడీలకు వేసవి సెలవుల నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వానికి సీఐటీయూ సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సమరశీల పోరాటాలకు అంగన్‌వాడీ సిబ్బంది సిద్ధం కావాలని కోరారు.
సిద్దిపేట మున్సిపాలిటీ రికార్డు
సిద్దిపేట మున్సిపాలిటీ రికార్డు


