బెల్టు జోరు!
జిల్లాలో బెల్ట్ షాపుల దందా జోరందుకుంది. యథేచ్ఛగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ధరలు పెంచి విక్రయాలు సాగుతున్నా.. సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కిరాణం, పాన్ షాపులలో అధిక ధరలకు విక్రయిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. – సాక్షి, సిద్దిపేట:
● ఒక్కో వైన్‌షాప్.. కొన్ని గ్రామాలు పంచుకున్న వ్యాపారులు
● బెల్ట్ షాపులకే మద్యం అందించేందుకు వైన్ షాపుల మొగ్గు
● పట్టించుకోని ఎకై ్సజ్ శాఖ అధికారులు
యథేచ్ఛగా మద్యం అమ్మకాలు
జిల్లాలో 93 వైన్ షాప్‌లు కొనసాగుతున్నాయి. మండల కేంద్రం, పట్టణం, ప్రధాన గ్రామాల్లో ఉన్న వైన్ షాప్‌ల వారు కొన్ని గ్రామాలు, కాలనీల చొప్పన సిండికేట్ అయి పంచుకున్నారు. ఉదాహరణకు ఒక మండల కేంద్రంలోని వైన్ షాప్ దాదాపు 12 గ్రామాల్లోని బెల్ట్ షాప్‌లకు మద్యాన్ని సరఫరా చేసే విధంగా ఒప్పందం చేసుకున్నారు. కొన్ని వైన్ షాపుల వారు నేరుగా ఆటోల ద్వారా ఊరూరా సరఫరా చేస్తున్నారు. తమకు కేటాయించిన గ్రామాలకు నిత్యం ఆటోల ద్వారా పంపించి అమ్ముతున్నారు. ఆ గ్రామాల్లోని బెల్ట్ షాప్‌ల వారు మరొక వైన్ షాప్ నుంచి తీసుకురాకుండా పరిశీలిస్తున్నారు.
బెల్ట్ షాప్‌లకు స్టాక్ ఇచ్చేందుకే మొగ్గు
క్వార్టర్ మద్యానికి రూ.10 అధికంగా, ఫుల్‌బాటిల్‌కు రూ.40 అధిక ధరల వరకు బెల్ట్ షాప్‌లకు వైన్ షాపు యజమానులు విక్రయిస్తున్నారు. అయితే.. బెల్ట్‌షాప్‌ల వారు రూ.20 నుంచి రూ.100 వరకు ఽఅధిక ధరకు అమ్ముతున్నారు. దీంతో బెల్ట్ షాప్‌లకు స్టాక్‌ను అందించేందుకు వైన్ షాపుల యజమానులు మొగ్గు చూపుతున్నారు. బెల్ట్ షాపుల ద్వారా ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం సమకూరుతోంది. మరింత ఆదాయాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఎకై ్సజ్ అధికారులు అంతర్గతంగా ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వైన్ షాపులో రాత్రి 10గంటల వరకే మద్యం లభిస్తుంది. అదే బెల్ట్ షాపులలో 24గంటలు లభిస్తోంది. మద్యం తాగి చాలా మంది ఇళ్లలో గొడవలు పడుతూ అర్థరాత్రి వరకు నానా రభస చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
80కి పైగా కేసులు
ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 271 మద్యం కేసులు నమోదు కాగా 5,181 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో దాదాపు 80కి పైగా కేసులు బెల్ట్ షాప్‌లకు సంబంధించినవి ఉన్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ గ్రామాల్లో బెల్ట్ షాపులలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
బెల్టు జోరు!


