రేవంత్ పాలనలో కంపుకొడుతున్న పల్లెలు
● సమస్యలే రాజ్యమేలుతున్నాయి
● గ్రామాలకు సరిపడా నిధులివ్వాలి
● మాజీ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట: పల్లెల ప్రగతి కోసం కేసీఆర్ అధికంగా నిధులు ఇచ్చి ముత్యంలా తీర్చిదిద్దితే.. సీఎం రేవంత్ పాలనలో మురికి కూపాలుగా మారాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. కేసీఆర్ హయాంలో దేశంలో ఎక్కడాలేని విధంగా పల్లెలకు ట్రాక్టర్లు, గ్రామాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు నిర్మించారని గుర్తు చేశారు. సిద్దిపేటలో రెడ్డి సంక్షేమ సంఘంలో సిద్దిపేట నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ సర్పంచ్, ఉపసర్పంచ్‌లను మంగళవారం సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హరీశ్‌రావు హాజరై మాట్లాడారు. కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీల హక్కు అన్నారు. కేసీఆర్ ఇచ్చినట్లు పల్లెలకు రేవంత్ రెడ్డి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన వైఫల్యం వల్లే గ్రామాల్లో సమస్యలు పేరుకపోయాయన్నారు. రెండేళ్లలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అన్నారు. పదవి అభరణం కాదు.. బాధ్యత, ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన అవకాశం అన్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్ సమన్వయంతో పని చేసి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంటి దీపమే ఇల్లు కాల్చినట్లుగా రాష్ట్రంలో పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్ట్ కరెంట్ ఉత్పత్తి పేరుతో నిర్మించి, తెలుగు గంగ పేరుతో లక్షల క్యూసెక్కుల నీటిని రాయలసీమకు తరలిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, బీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు. అలాగే కొండపాక మండలంలోని బీఆర్‌ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లను హరీశ్ సన్మానించారు.


