అద్దెకు స్వస్తి సాధ్యమేనా..!
ఆ భవనాలను షిఫ్ట్ చేయాలని సర్కార్ ఆదేశం
● ఇప్పటికే సమీకృత కలెక్టరేట్ ఫుల్
● ఏదో భవనం కేటాయించండి
● కలెక్టర్‌కు వినతుల వెల్లువ
అద్దె భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ నెలాఖరులోగా షిఫ్ట్ కావాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలెట్టారు. గడువులోగా కార్యాలయాలను తరలించడం సాధ్యమవుతుందా? లేదా అని ఆయా శాఖల అధికారులకు టెన్షన్ పట్టుకుంది.
సాక్షి, సిద్దిపేట: జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు అన్ని ఒకే చోట ఉండాలని ఉద్దేశంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను నిర్మించారు. 2022 జూన్‌లో దాదాపు 40 ప్రభుత్వ కార్యాలయాలను కలెక్టరేట్‌లోకి షిఫ్ట్ చేశారు. అయినప్పటికీ ఇంకా పలు శాఖల జిల్లా కార్యాలయాలు అద్దె భవనాలు, ఇతర శాఖల ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయి. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాన్ని కేటాయించాలని జిల్లా కలెక్టర్‌కు ఆయా శాఖల అధికారులు విన్నవించుకుంటున్నారు.
ఒకే గదిలో ఐదు కార్యాలయాలు
సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో పలు శాఖల కార్యాలయాలు ఇరుకుగా ఉండటంతో అనేక ఇక్కట్లుకు గురవుతున్నారు. ఒకే గదిలో ఐదు కార్యాలయాలు కొనసాగుతున్నాయి. జిల్లా ఉపాధి కార్యాలయం, జిల్లా భూగర్భజల అధికారి, జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి, జిల్లా పరిశ్రమల కేంద్రం, పరిశ్రమల ఇన్‌స్పెక్టర్ కార్యాలయాలు అన్ని ఒకే గదిలోనే కొనసాగుతున్నాయి. ఈ ఽశాఖల అధికారులకు ప్రత్యేక చాంబర్లు లేక ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఏ కార్యాలయం అధికారి ఎక్కడున్నారో తెలియక ప్రజలు తికమక పడుతున్నారు. అలాగే.. మత్స్య, గృహనిర్మాణ సంస్థ, కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్‌లు ఒకే గదిలో కొనసాగుతున్నాయి. ఎస్సీ, గిరిజన, మైనార్టీ శాఖలు, ఆహార భద్రత కార్యాలయాల పరిస్థితి ఇలాగే ఉంది.
దాదాపు 20 నెలల అద్దె పెండింగ్
ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట అద్దె భవనంలో జిల్లా వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం కొనసాగుతోంది. ఈ కార్యాలయ భవనానికి అద్దె దాదాపు ప్రతి నెల రూ.40 వేలు చెల్లిస్తున్నారు. ఆ భవన యజమానికి సుమారుగా 20 నెలల అద్దె పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఒక వేళ భవనం ఖాళీ చేస్తే పూర్తిగా బకాయి చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రి పక్కన ఉన్న పశువైద్యశాల పైన భవనం ఖాళీ ఉందని, దానిని కేటాయించాలని కలెక్టర్‌ను కోరినట్లు సమాచారం. హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ అద్దె భవనంలో తూనికల కొలతల కార్యాలయం కొనసాగుతోంది. ఈ కార్యాలయాన్ని ఎక్కడి షిఫ్ట్ చేయాలో ఇంకా కలెక్టర్ నిర్ణయం తీసుకోలేదు. మూడు తహసీల్దార్ కార్యాలయాలు, ఇతర డివిజన్ కార్యాలయాలు సైతం అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కొమురవెల్లి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని దేవాలయానికి చెందిన భవనంలోకి తరలించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
30లోగా షిఫ్ట్ చేస్తాం
అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి షిఫ్ట్ చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఈ నెల 30వ తేదీలోగా షిఫ్ట్ చేస్తాం. వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాన్ని పశువైద్యశాలలో ఖాళీగా ఉన్న భవనంలోకి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.
– రాజ్ కుమార్, ఏవో, కలెక్టరేట్


