ఉద్యోగి సేవలతోనే గుర్తింపు
● ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
● జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి
దుబ్బాకటౌన్: ప్రతి ఒక్క ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరని, ఉద్యోగ సమయంలో చేసిన సేవలే గుర్తింపు తెస్తాయని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఇందుప్రియల్ జెడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి పనిచేసిన అఫ్జల్ హుస్సేన్ పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, అనుభవం నిష్ణాతులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చేరి ఉత్తమ ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి విద్యార్థులకు మాక్ టెస్ట్‌లు నిర్వహించాలని, విద్యార్థుల విద్య నైపుణ్యాలను అంచనా వేయడానికి ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీని అందించాలన్నారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అనిల్ కుమార్, షకీల్ పాషా, ప్రధానోపాధ్యాయులు కరీమొద్దీన్, వలీఅహ్మద్, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శశిధర్ శర్మ, టీపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.


