సిద్దిపేట సీపీగా రష్మి
సిద్దిపేటకమాన్: సిద్దిపేట పోలీసు కమిషనర్ విజయ్‌కుమార్ బదిలీ అయ్యారు. హైదరాబాద్ సిటీ నార్త్‌జోన్ డీసీపీగా పనిచేస్తున్న 2019 బ్యాచ్‌కు చెందిన సాధన రష్మి పెరుమాళ్‌ను నూతన పోలీసు కమిషనర్‌గా నియమించారు. ఈ మేరకు బుధవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన్ను హైదరాబాద్ సిటీ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్‌గా బదిలీ చేశారు.
అక్రమార్కుల గుండెల్లో
రైళ్లు పరుగెత్తించిన విజయకుమార్
గతేడాది అక్టోబర్ 6న సిద్దిపేట పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన విజయ్‌కుమార్.. తన దైన శైలిలో విధులు నిర్వహిస్తూ తన మార్కును చూపారు. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. అక్రమ ఇసుక, గంజాయి, డ్రగ్స్ రవాణ చేసే వారిపై కేసులు నమోదు చేసి, వారిపై ఉక్కుపాదం మోపారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడిన మందుబాబులకు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.10వేల జరిమాన, జైలు శిక్ష పడేలా చర్యలు చేపట్టారు. పట్టణంలోని సుభాష్‌రోడ్డులో ట్రాఫిక్ సిబ్బందితో కలిసి ఇబ్బందులు తొలగింపచేశాడు. బస్టాండ్ చౌరస్తా నుంచి పాత కూరగాయల మార్కెట్ ప్రాంతం వరకు తోపుడు బండ్లు, పుట్‌పాత్‌లు ఆక్రమించి వ్యాపారాలు చేసే వారిని మార్కింగ్ లోపల పెట్టి వ్యాపారాలు చేసుకునేలా చేశారు. ఇటీవల జిల్లాలో జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో మద్యం సరఫరా, నగదు పంపిణీ అరికట్టి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కృషి చేశారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని గ్రామాల్లో బెల్ట్ షాప్‌లను మూసి వేయించి, నిర్వాహకులను తహసీల్దార్లు ఎదుట బైండోవర్ చేశారు. సిద్దిపేట పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ పునరుద్ధరించారు. విజయ్‌కుమార్ రాజకీయ నేతలకు సైతం దూరంగా ఉండేవారు.


