నీరివ్వకపోతే సచివాలయం ముట్టడి
దుబ్బాక: మల్లన్నసాగర్ ప్రాజెక్టు మూలంగా ఇక్కడి రైతులు సర్వం కోల్పోయారని, దుబ్బాక నియోజకవర్గానికి నీరిచ్చిన తర్వాతనే వేరే ప్రాంతాలకు తరలించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. లేకుంటే రైతులతో కలసి సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. బుధవారం దుబ్బాక మండలంలోని పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు మల్లన్నసాగర్ 4 ఎల్‌ఈడీ కాల్వ పూర్తి చేయించి సాగు నీరందించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులు, ప్రధాన కాల్వలు నిర్మిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఉప కాల్వలు కూడా నిర్మించడం లేదని విమర్శించారు. రెండేళ్లుగా ఉప కాల్వలు నిర్మించాలని, అసెంబ్లీ సాక్షిగా గళమెత్తామని, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి విన్నవించినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. యాసంగిలో పెద్ద ఎత్తున రైతులు పంటలు సాగుచేస్తున్నారని, కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల నుంచి కూడవెల్లి వాగుతో పాటు చిన్నశంకరంపేట, రామాయంపేట, ఉప్పరిపల్లి, దుబ్బాక కాల్వలకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇర్కోడ్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూ.111 కోట్లు మంజూరు చేసిందని, ఇప్పటి వరకు రూ.93 కోట్లు ఖర్చు అయ్యాయని, మిగిలిన పనులు నత్తనడకన సాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ పనులు వెంటనే పూర్తి చేసి యాసంగి పంటలకు నీళ్లు అందించాలని కోరారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేదిలేదన్నారు.
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి


