జిల్లా పరిధి తగ్గనుందా?
మూడు జిల్లాల పరిధిలో..
● హుస్నాబాద్‌ను కరీంనగర్‌జిల్లాలో కలుపుతారా..!
● అంతటా జోరుగా చర్చ
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణపై అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటనతో జిల్లాలో మండలాలు తగ్గుతాయా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. 2016లో సిద్దిపేట జిల్లా ఏర్పాటు చేసి కరీంనగర్ జిల్లా పరిధిలోని హుస్నాబాద్, కోహెడ మండలాలను కలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మూడు జిల్లాలో కలిపారని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరీంనగర్‌లో కలుపుతామని గతంలో రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కరీంనగర్‌లో కలపాలని హుస్నాబాద్, బెజ్జంకిలలో ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు సైతం నిర్వహించారు. తాజాగా మంత్రి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటనతో కరీంనగర్‌లో హుస్నాబాద్ కలుస్తుందా? అని పలువురు చర్చించుకుంటున్నారు.
23 మండలాలతో జిల్లా ఆవిర్భావం
23 మండలాలతో 11 అక్టోబర్ 2016న సిద్దిపేట జిల్లాగా ఆవిర్భవించింది. తర్వాత పలు చోట్ల ప్రత్యేక మండలం కావాలని ప్రజలు ఉద్యమాలు చేయడంతో కుకునూరుపల్లి, అక్బర్‌పేట–భూంపల్లి, దూల్మిట్ట మండలాలను ఏర్పాటు చేశారు. దీంతో 26 మండలాలకు చేరింది. తొమ్మిదేళ్లుగా ప్రజలకు చెరువై పాలన విజయవంతంగా కొనసాగుతోంది. అయినప్పటికీ పలు మండలాలకు చెందిన కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
బెజ్జంకిలో ఉద్యమం
బెజ్జంకి మండలాన్ని సైతం కరీంనగర్‌లో కలపాలని కరీంనగర్ సాధన సమితి పేరుతో బెజ్జంకి ప్రజలు ఉద్యమం చేస్తున్నారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు వినతి పత్రం అందించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఉండటంతో గతంలో ఎన్నికల్లో ఇద్దరు హామీలు ఇచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన మూడు మండలాలు కరీంనగర్‌లో కలిపేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా పునర్విభజన అవుతుందా?.. లేక ఇలానే కొనసాగిస్తారా వేచిచూడాల్సిందే.
హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో ఉంది. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలు సిద్దిపేట జిల్లాలో, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలను హన్మకొండ జిల్లాలో, చిగురుమామిడి, సైదాపూర్ మండలాలు కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్నాయి. అప్పట్లో కరీంనగర్ జిల్లా నుంచి తమను వేరుచేయడంపై హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల ప్రజలు ఆందోళనలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలను కరీంనగర్ జిల్లాలో కలుపుతామని గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. అలాగే గతంలో పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కరీంనగర్‌లో హుస్నాబాద్‌ను కలుపుతామని సీఎం రేవంత్‌రెడ్డి సైతం హామీ ఇచ్చారు.


