గణితంపై భయం వీడాలి
● ఇష్టపడి చదివితే అంతా సులభమే..
● టీఎంఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్
గజ్వేల్‌రూరల్: గణితంపై భయం వద్దని, ఇష్టపడి చదివితే ఎంతో సులభంగా నేర్చుకోవచ్చని తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం(టీఎంఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కందికొండ శ్రీనివాస్ అన్నారు. టీఎంఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం గజ్వేల్ పట్టణంలోని బాలికల ఎడ్యుకేషన్ హబ్‌లోగల మోడల్‌స్కూల్‌లో రాష్ట్రస్థాయి గణిత ప్రతిభా పరీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గణితంపై విద్యార్థులు భయాందోళనకు గురికావొద్దన్నారు. గణితం పట్ల ఆసక్తిని పెంచేందుకు ప్రతియేటా శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్ట్‌లను నిర్వహిస్తున్నామన్నారు. టీఎంఎఫ్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, రిటైర్డ్ ప్రొఫెసర్ రాయల్, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ రమేష్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, టీఎంఎఫ్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్‌రెడ్డి, కోశాధికారి సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
రాష్ట్రస్థాయిలో నిర్వహించిన మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్ట్‌లో ఇంగ్లిష్ మీడియంలో ప్రథమ స్థానంలో ముదాసీర్(వరంగల్), ద్వితీయ స్థానంలో మురారి(రంగారెడ్డి), తృతీయ స్థానంలో శివసాయి(కరీనంగర్)లు నిలవగా, తెలుగు మీడియంలో ప్రథమస్థానంలో రాంచరణ్(కామారెడ్డి), ద్వితీయ స్థానంలో విజయలక్ష్మి(జోగులాంబ గద్వాల), తృతీయ స్థానంలో హరీశ్(సూర్యాపేట) నిలిచారు. అదే విధంగా ఉర్దూ మీడియంలో ప్రథమస్థానంలో ఆస్మాబేగం(మహబూబ్‌నగర్), ద్వితీయస్థానంలో సుహానా(జనగామ), తృతీయస్థానంలో రహీమున్నిసా(హనుమకొండ) నిలవగా, గురుకులాల విభాగంలో ప్రథమస్థానంలో శ్రీసాయిహర్ష(మంచిర్యాల), ద్వితీయస్థానంలో సాహిత్య(మంచిర్యాల), తృతీయస్థానంలో ఆయేషా(నిజామాబాద్) నిలిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విజేతలకు నగదు బహుమతితో పాటు మెడల్స్, ప్రశంసాపత్రాలను అందజేశారు.


