ఆందోళన వద్దు
జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి
చిన్నకోడూరు(సిద్దిపేట): యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని స్వరూప రాణి అన్నారు. శనివారం మండల పరిధిలోని రామంచలో రైతులకు యూరియా కార్డులు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఒక ఎకరానికి మూడు బస్తాలు, రెండు ఎకరాలకు ఐదు బస్తాలు, నాలుగు ఎకరాలకు 10 బస్తాల యూరియా అందజేస్తామన్నారు. నాలుగు విడతల్లో రైతులకు యూరియా అందజేస్తామని, కొరత రాకుండా పారదర్శకంగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకొచ్చి యూరియా కార్డులు తీసుకోవాలని కోరారు. కౌలు రైతులు భూ యాజమాని పాసుపుస్తకం జిరాక్స్ తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ పద్మ, ఏఓ జయంత్ కుమార్, సర్పంచ్ భవాని, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.
ప్రజల నమ్మకాన్ని
వమ్ము చేయకండి
బాలల సంక్షేమ సమితి చైర్మన్ నర్సింహులు
వర్గల్(గజ్వేల్): గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, వాటి అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకమని జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్మన్, జాతీయ యువజన అవార్డు గ్రహీత డాక్టర్ దేశబోయిని నర్సింహులు పేర్కొన్నారు. శనివారం శేరిపల్లి సర్పంచ్ ఎర్ర పావని, ఉపసర్పంచ్ బీరయ్యలను సన్మానించారు. ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా పారదర్శక సుపరిపాలనతో గ్రామాభివృద్ధికి అంకితం కావాలని ఆకాంక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రజలకు చేరవేయడంలో కీలకపాత్ర పోషించాలని కోరారు. బాలల హక్కుల పరిరక్షణ, బాల్యవివాహాలు నివారణ, బాల కార్మికులు లేని సమాజ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు మోహన్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, మొగిలి తదితరులు పాల్గొన్నారు.
‘ఇందూరు’ అసోసియేట్
ప్రొఫెసర్‌కు డాక్టరేట్
సిద్దిపేటఅర్బన్: పొన్నాలలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శనిగరం పోచయ్య డాక్టరేట్ పట్టా పొందారు. ‘సింథసిస్ అండ్ థర్మల్ మెటీరియల్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఫేస్ చేంజ్ మెటీరియల్స్ రీఇన్‌ఫోర్స్‌డ్ విత్ నానో కాంపోజిట్ మెటీరియల్స్’ అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను జేఎన్‌టీయూ నుంచి డాక్టరేట్ పొందారు. ఆయనను కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ కృష్ణారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ వి.పి.రాజు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బెనర్జీ, పీఆర్వో రఘు అభినందించారు.
నేడు రాచబాట శతక
పుస్తకావిష్కరణ
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాకు చెందిన ప్రముఖ కవి రాజయ్య యాదవ్ రచించిన రాచ బాట శతకం పుస్తకావిష్కరణ ఆదివారం నిర్వహించనున్నట్లు బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం తెలిపారు. ఉదయం 10 గంటలకు సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, భానుప్రకాశ్, అశోక్, చంద్రయ్య, ఐలయ్య యాదవ్ తదితరులు హాజరవుతారన్నారు.
ఆందోళన వద్దు
ఆందోళన వద్దు


