వార్డుల విభజనలో శాసీ్త్రయత ఏదీ..?
గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వార్డుల విభజన సక్రమంగా జరగలేదంటూ పట్టణ ప్రజలు, నాయకుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. భౌగోళికంగా దూరంగా ఉండే కాలనీలను ఒకే వార్డులో చేర్చడం వల్ల అభివృద్ధికి అవరోధంగా మారే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు వార్డుల పెంపుపైనా ప్రభుత్వంపై రోజురోజూకూ ఒత్తిడి పెరుగుతున్నది. మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ.. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో నెలకొన్న ప్రత్యేకమైన పరిస్థితులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని మిగితా మున్సిపాలిటీల్లో ముసాయిదా ఓటరు జాబితా ప్రకటన, ఇతర కార్యక్రమాలు సాఫీగా సాగుతుండగా.. ఇక్కడ భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక మున్సిపల్ అధికారులు శుక్రవారం రాత్రి ముసాయిదా ఓటర్ల జాబితా అధికారికంగా ప్రకటించారు. మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో 46,740మంది ఓటర్లు ఉండగా.. ఇందులో మహిళలు 24,001మంది, పురుషులు 22,738 మంది ఉన్నారని తేల్చారు. వార్డుల విభజనపై కూడా ప్రకటన చేశారు. కానీ వారు ప్రకటించిన వార్డుల విభజనలో శాసీ్త్రయత లోపించడం, కొత్త కాలనీలు విలీనమై ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగినా వార్డుల సంఖ్య పెరగకపోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
వార్డుల పెంపుపై పెరుగుతున్న ఒత్తిడి
మున్సిపాలిటీలో కొత్తగా ఆర్‌అండ్‌ఆర్ కాలనీ విలీనమై.. ఓటర్ల సంఖ్య 32వేల నుంచి 46వేల పైచిలుకు పెరిగినా.. వార్డుల పెంపు జరగకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. గతంలో ఉన్న 20 వార్డుల్లోనే ఆర్‌అండ్‌ఆర్ కాలనీ ఓటర్లను సర్దుబాటు చేయడం వల్ల పట్టణంలోని వివిధ పార్టీల నాయకులు, ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై శుక్రవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి ప్రస్తావించడంపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. పరిశీలన చేస్తామని ప్రకటన కూడా చేశారు. కానీ ఎన్నికల లోపు ఈ ప్రక్రియ జరుగుతుందా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది.
దూరంగా ఉన్న కాలనీలు ఒకే వార్డులోకి
మున్సిపాలిటీలో వార్డుల విభజనకు సంబంధించి శాసీ్త్రయత లోపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. ప్రత్యేకించి భౌగోళికంగా దూరంగా ఉన్న కాలనీలను ఒకే వార్డులోకి చేర్చడం..అభివృద్ధికి అవరోధంగా ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఉదాహరణకు పట్టణంలోని శివాలయం కాలనీ గతంలో 14వ వార్డులో ఉండేది. అప్పట్లోనూ విభజన సక్రమంగా లేక కాలనీవాసులు నష్టపోయారు. తాజాగా 6, 13 వార్డుల్లో ఈ కాలనీని కలిపారు. 6వ వార్డులో శివాలయం కాలనీకి భౌగోళికంగా దూరంగా ఉండే... ప్రజ్ఞాపూర్ బీసీ కాలనీ, బాలాజీ ఎన్‌క్లేవ్, సిరి ఎన్‌క్లేవ్, లక్ష్మీప్రసన్న కాలనీ, వాసవీనగర్‌కాలనీతోపాటు ముట్రాజ్‌పల్లి గ్రామం ఉన్నది. 13వ వార్డులోనూ అదే తరహాలో పాత ముట్రాజ్‌పల్లి, హౌసింగ్ బోర్డు కాలనీ, జీడీఆర్ పాఠశాల, భారత్‌నగర్ కాలనీలు ఉన్నాయి. దీనివల్ల అభివృద్ధికి అవరోధం ఏర్పడనుందని ఆ కాలనీవాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ శనివారం మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పట్టణంలో ఇరవై వార్డుల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది.
భౌగోళికంగా దూరం ఉండే కాలనీలు ఒకే వార్డులోకి..
ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న
అభ్యంతరాలు
అభివృద్ధికి అవరోధమవుతుందని
అందోళన
వార్డుల పెంపునకూ ప్రభుత్వంపై
పెరుగుతున్న ఒత్తిడి
గజ్వేల్–ప్రజ్ఞాపూర్
మున్సిపాలిటీలో పరిస్థితి


