సీఎం ఇంటి ఎదుట ధర్నా చేయండి
గజ్వేల్: నియోజకవర్గంలో నెలకొన్ని సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటిముందు ధర్నా చేయాల్సిన కాంగ్రెస్ నేతలు.. మతి భ్రమించి కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద చేశారని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గజ్వేల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల తీరుపై మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్‌ను అభివృద్ధిలో 30ఏళ్ల ముందుకు తీసుకెళ్లారని గుర్తు చేశారు. ఇంకా ఎన్నో సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని పూర్తి చేయడానికి రూ.250కోట్ల నిధులు గత ప్రభుత్వం మంజూరు చేస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి రద్దు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లల్లో గజ్వేల్‌లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి మెప్పు కోసం కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద కొందరు రాజకీయ నిరుద్యోగులు ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి, మాజీ జెడ్పీటీసీ మల్లేశం, బీఆర్‌ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్‌మీరా తదితరులు పాల్గొన్నారు.
ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్
వంటేరు ప్రతాప్‌రెడ్డి మండిపాటు


