పల్లెలు గాడిన పడేనా?
చిన్నకోడూరు(సిద్దిపేట): గ్రామాల్లో పంచాయతీ నూతన పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాయి. రెండేళ్లుగా పాలకవర్గాలు లేక అధికారుల పాలనలో సాగాయి. నిధుల లేమితో చాలా గ్రామాల్లో సమస్యలు నెలకొన్నాయి. వీటి పరిష్కారానికి కొత్త పాలకవర్గాలు కృషి చేయడం కత్తిమీద సాములాంటిదే. మండలంలో 80 శాతానికి పైగా సర్పంచ్‌లు రాజకీయాలకు పూర్తిగా కొత్తవారే కావడం విశేషం. అందరూ రిజర్వేషన్‌ల పరంగా పోటీ చేసి సర్పంచ్‌లుగా గెలుపొందారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి వీరు ఏమేరకు కృషి చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
14 మంది మహిళలే..
చిన్నకోడూరు మండలంలో 28 గ్రామ పంచాయతీలు ఉండగా, వీటిలో 14 మంది మహిళలు సర్పంచ్‌లుగా గెలుపొందారు. వీరిలో అంతా కొత్తవారే. రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. పంచాయతీ కార్యదర్శులు అత్యవసర పనులకు సొంత డబ్బులు ఖర్చు చేసినప్పటికీ బిల్లులు రాలేదు. కొత్త పాలకవర్గాలకు సమస్యలు తలనొప్పిగా మారనున్నాయి. చాలా గ్రామాల్లో గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు ఇతర భవనాల్లో కొనసాగుతున్నాయి. కొత్తగా ఏర్పడ్డ ఎల్లమ్మజాలు, శంకరాయకుంట, కమ్మర్లపల్లి గ్రామాలకు జీపీ భవనాలు లేక కుల సంఘాల భవనాల్లో పాలకవర్గాలు కొనసాగిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో జీపీ భవన నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోవడంతో ఇతర భవనాల్లో కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి, అభివృద్దికి కొత్త పాలకవర్గాలు ఏమేరకు కృషి చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఎక్కువ మంది సర్పంచ్‌లు కొత్తవారే
గ్రామాల్లో సమస్యలు పరిష్కారమయ్యేనా?


