నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి
సిద్దిపేటరూరల్: నీటి ఎద్దడి ఏర్పడకుండా జిల్లా స్థాయిలో వాచ్‌డాగ్ కమిటీలు పనిచేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నీటి వనరులు తరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలకు నీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా కమిటీ పనిచేయాలని సూచించారు. వర్షపు నీటి హార్వెస్టింగ్‌పై సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయడానికి ముందుగానే 300 చదరపు మీటర్ల కంటే ఎక్కువ ప్లాట్ ఏరియా ఉన్న అన్ని భవనాలు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ కలిగి ఉండాలన్నారు. 10 వేల చదరపు మీటర్లు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భారీ భవనాలలో అలాగే వంద అంతకంటే ఎక్కువ యూనిట్లు ఉన్న గ్రూప్ హౌస్‌లకు వ్యర్థ జలాల రీసైక్లింగ్ ప్లాంట్‌లను కలిగి ఉండేలా చూడాలన్నారు. విద్యా సంస్థలు, హాస్టళ్లలో, ప్రభుత్వ కార్యాలయాల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లను ఏర్పాటు చేయాలన్నారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో డీపీఓ దేవకీదేవి, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, మిషన్ భగీరథ అధికారులు మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్


