జిల్లాలో జహీరాబాద్, కోహీర్ మండలాలను పూర్తి కరువు, మిగిలిన 26 మండలాలను ఓ మోస్తారు (మోడరేట్) కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ‘మోస్తారు’ కరువుగా ప్రకటిస్తే కరువు సాయం అందకుండా పోతుందా? అనే సందేహాలను రైతులు, రైతు సంఘాల నాయకులు వ్యక్తం చేస్తున్నారు. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి
ఎల్‌నినో ప్రభావంతో దాదాపు జిల్లా అంతటా తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. సకాలంలో వర్షాలు కురియక పంటలు ఎండిపోయాయి. దిగుబడులపై తీవ్ర ప్రభావం పడింది. ప్రధానంగా పత్తి, సోయా, వరి, జొన్న వంటి పంటలతో పాటు దాదాపు అన్ని పంటల దిగుబడులు దారుణంగా పడిపోయాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. చాలా చోట్ల పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ తరుణంలో మోస్తారు కరువు ప్రకటన ఏంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరువు సహాయక చర్యలు ప్రభుత్వం కొన్ని మండలాలకే పరిమితం చేయకుండా., అన్ని మండలాలకు వర్తింపచేయాలని రైతులు, రైతుల సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. కరువు మండలాలుగా ప్రకటిస్తే.. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, పంట రుణాల మారటోరియం, పాడి రైతులకు పశుగ్రాసం పెంచేందుకు ఆర్థిక సాయం వంటి సహాయక చర్యలు చేపడతారు.
పలు అంశాల ఆధారంగా..
పలు అంశాలను పరిశీలించాకే కరువు మండలాల ప్రకటన జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానంగా ఆయా మండలాల్లో నమోదైన వర్షపాతం.. భూగర్భ జల మట్టాలు.. పడిపోయిన దిగుబడులు.. పంట నష్టం.. భూమిలో తేమ శాతం.. వంటి అంశాలను పరిశీలించి శాసీ్త్రయంగా కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటించిందని చెబుతున్నారు. జహీరాబాద్, కోహీర్ మండలాల్లో ఆయా పారామీటర్ల మేరకు ఉండటంతో పూర్తి కరువు మండలాలుగా ప్రకటించారని, మిగిలినవి మోస్తారు కరువు మండలాలుగా గుర్తించినట్లు వెల్లడించారు.
రైతు వారీగా పంట నష్టం వివరాలు
కరువు ప్రకటన నేపథ్యంలో వ్యవసాయశాఖ పంట నష్టం, దిగుబడులపై సర్వే చేస్తోంది. రైతు వారీగా ఈ వివరాలను సేకరిస్తోంది. 33 శాతం కంటే ఎక్కువ నష్టపోయిన రైతులకు పరిహారం అందే అవకాశాలున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు సుమారు 41 వేల ఎకరాల మేరకు ఈ సర్వే పూర్తయిందని చెబుతున్నారు. పూర్తి స్థాయిలో సర్వే జరిగాయక ప్రభుత్వానికి నివేదిక పంపుతామని చెబుతున్నారు.
మిగిలినవి ‘మోస్తారు కరువు’గా ప్రకటన
దీనిపై రైతు సంఘాల పెదవి విరుపు
రైతులందరికీ సాయం అందేలా చూడాలని డిమాండ్
పంట నష్టం వివరాలు సేకరిస్తున్న వ్యవసాయశాఖ
సుమారు 41 వేల ఎకరాల్లో సర్వే పూర్తి


