సంగారెడ్డి ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథం, సామాజిక స్పృహను పెంపొందించేందుకు జిజ్ఞాస వంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ఏఎస్పీ చైతన్యరెడ్డి అన్నారు. సోమవారం సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాలలో కమిషనరేట్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిజ్ఞాస రాష్ట్రస్థాయి బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో పరిశోధనపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వీటి ద్వారా విద్యార్థుల్లో సామాజిక స్పృహ, ఆలోచనా శక్తి, పరిశోధనా సామర్థ్యం పెరుగుతాయని అన్నారు. రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీల్లో అర్థశాస్త్రంలో పటాన్చెరు ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జీవశాస్త్రంలో నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రథమ బహుమతులు సాధించాయి. విజేతలకు రూ.30 వేల నగదు బహుమతి అందజేశారు. జంతుశాస్త్రంలో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వృక్షశాస్త్రంలో పటాన్చెరు ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ద్వితీయ బహుమతులు సాధించాయి. వీరికి రూ.21 వేలు, రాజనీతి శాస్త్రంలో తారా ప్రభుత్వ కళాశాల, ఆంగ్లంలో ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హిందీలో సంగారెడ్డి ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల తృతీయ బహుమతులు సాధించాయి. వీరికి రూ.12 వేల నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ప్రవీణ, వివిధ కళాశాలల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
ఏఎస్పీ చైతన్య రెడ్డి


