‘చేయూత’తో ఆర్థిక భరోసా | - | Sakshi
Sakshi News home page

‘చేయూత’తో ఆర్థిక భరోసా

Nov 17 2026 8:17 AM | Updated on Nov 17 2026 8:17 AM

‘చేయూత’తో ఆర్థిక భరోసా

మంత్రి దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి జోన్‌: చేయూత పింఛన్లతో లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కలుగుతుందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం పట్టణంలోని ఓ గార్డెన్‌లో లబ్ధిదారులకు ప్రొసిడింగ్స్‌ అందించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం చేయూత పింఛన్లను మంజూరు చేస్తోందన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 3,917 మందికి పింఛన్లు మంజూరైనట్లు వెల్లడించారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఈ నెల 19న పింఛన్‌ నగదు జమ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా వైద్య కళాశాలకు 18 పీజీ సీట్లు మంజూరయ్యాయని, సంగారెడ్డి, అందోల్‌ ప్రాంతాల్లో నర్సింగ్‌ కళాశాలలను ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో టీజీఐఐసీ మాజీ చైర్‌పర్సన్‌ నిర్మల, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంజయ్య, సంగారెడ్డి, సదాశివపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్లు కూన వనిత, అంజమ్మ, అదనపు కలెక్టర్‌ పాండు, ఆర్డీఓ రాజేందర్‌, డీఆర్‌డీఏ ఏపీడీ సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.

పేదల ఇంటికే సంక్షేమ ఫలాలు

వట్‌పల్లి(అందోల్‌): సంక్షేమ ఫలాలను పేదల ఇంటికి చేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం అందోల్‌ మండలం అల్మాయిపేటలోని ఓ గార్డెన్‌లో లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసి మాట్లాడారు. జిల్లాలో 18 వేలు, అందోల్‌ నియోజకవర్గంలో 3 వేలకుపైగా నూతన పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా పేదలకు సన్నబియ్యం, కొత్త రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున బ్యాంకు లింకేజీ, వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని వివరించారు. హుమ్నాపూర్‌లో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గం విద్యా హబ్‌గా అభివృద్ధి చెందుతోందని, యువతకు నాణ్యమైన విద్యతో పాటు నైపుణ్యాలను అందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. కనీసం 10 నుంచి 15 పరిశ్రమలు ఏర్పాటు కానున్నట్లు స్పష్టం చేశారు. మెట్ట ప్రాంతాలకు సైతం సాగునీరు అందించాలనే లక్ష్యంతో పెద్దారెడ్డిపేట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రస్తుతం 1,48,562 మంది లబ్ధిదారులకు ప్రతీ నెల రూ.32.73 కోట్ల పింఛన్లు అందిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ పాండు, ఆర్డీఓ రమేశ్‌బాబు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి జగదీశ్‌, డీఆర్‌డీఏ ఏపీడీ సూర్యారావు, మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు కృష్ణారెడ్డి, చిట్టిబాబు, కమిషనర్‌ తిరుపతి, అధికారులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement