సంగారెడ్డి జోన్: ప్రజల నుంచి అందే ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ సంగీత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని అర్జీలను స్వీకరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఫిర్యాదుపై అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరించాలని సూచించారు. ఏ ఒక్క వినతిని నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతాయుతంగా పరిష్కారం చూపాలన్నారు. మొత్తం 75 వినతులు రాగా, సంగారెడ్డి డివిజన్ నుంచి 16, నారాయణఖేడ్ 3, కలెక్టరేట్ పరిధిలో 56 వినతులు నమోదయ్యాయి. జహీరాబాద్, అందోల్ డివిజన్ల నుంచి ఎలాంటి వినతులు అందలేదని అధికారులు తెలిపారు.
రామంద్రాపురం(పటాన్‌చెరు): 13వ రాష్ట్ర అంతర్ జిల్లాల రోలర్ స్పీడ్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన స్కేటర్లు సత్తా చాటారు. ఈనెల 12 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో జరిగిన పోటీల్లో 20 మంది క్రీడాకారులు 64వ ఆర్‌ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు తరఫున ఆడేందుకు ఎంపికై నట్లు జిల్లా స్కేటింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విఠల్ తెలిపారు. వచ్చే నెలలో బెంగళూర్‌లో జాతీయ పోటీలు జరగనున్నాయని ఆయన తెలిపారు.
చెట్ల నరికివేత
సంగారెడ్డి జోన్: కలెక్టరేట్ భవనానికి అడ్డుగా ఉన్నాయని, కార్యాలయాల్లోకి పాములు వస్తున్నాయనే సాకుతో ఇష్టారాజ్యంగా చెట్లను నరికి వేశారు. పదేళ్ల క్రితం నాటిన మొక్కలు ఏపుగా పెరిగి నీడను ఇవ్వడంతో పాటు పచ్చదనం పరుచుకొని ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఓ వైపు ప్రభుత్వాలు మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించేలా వివిధ కార్యక్రమాలు చేపడుతుంటే.. మరోవైపు అధికారులు మాత్రం యథేచ్ఛగా చెట్లను నరికి వేయిస్తున్నారు. సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న భారీ వృక్షాలను యంత్రాల సహాయంతో నరికి వేశారు. ప్రజావాణిలో ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చిన వారితో పాటు పర్యావరణ ప్రేమికులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. నిబంధనలు సామాన్యులకేనా? చెట్లు నరికివేయించిన అధికారులపై ఉండవా? అని ప్రశ్నిస్తున్నారు. భవనాలకు అడ్డుగా వస్తే కొమ్మలను నరకాలే గాని పూర్తిగా చెట్లను నరికి వేయడం ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల్లో సోమ వారం నిర్వహించిన టెండర్ల ఆదాయం రూ. 2.76 కోట్లు వచ్చినట్లు ఈఓ వీరేశం తెలిపారు. దేవస్థానం వద్ద కొబ్బరికాయలు అమ్ముకునే హక్కు కోసం రూ.కోటీ 21లక్ష 10వేలు పాడి లింగాజీ టెండర్ కై వసం చేసుకున్నారు. ఒడిబియ్యం సేకరణకు రూ. కోటీ 13లక్షల 10వేలకు బాల్‌రాజు, పూజా సామగ్రి విక్రయానికి సంబంధించి రూ. 34లక్షల 50వేలకు నర్సాగౌడ్, పాద రక్షలు నిలుపు స్థలం కోసం రూ. 7.30 లక్షలకు దుర్గాగౌడ్ టెండర్ దక్కించుకున్నారు. తలనీలాలు, కొబ్బరి ముక్కలు పోగు చేసుకునే హక్కు , ఎగ్జిబిషన్ నిర్వహించుకునే హక్కు కోసం ఎవరూ టెండర్ వేయకపోవడంతో వాయిదా పడ్డాయి. కాగా గత ఏడాది ఈ టెండర్ల ద్వారా ఆలయానికి రూ. 2 కోట్ల 27లక్షల 55వేలు ఆదాయం వచ్చింది. గతంతో పోలిస్తే ఈ సారి రూ.48లక్షల 45వేలు ఆదాయం అధికంగా వచ్చింది. కార్యక్రమంలో సూపరింటెండెంట్ రంగారావు, అధికారులు, టెండర్ దారులు పాల్గొన్నారు.


