తేలని గిట్టుబాటు ధర | - | Sakshi
Sakshi News home page

తేలని గిట్టుబాటు ధర

Nov 16 2026 8:47 AM | Updated on Nov 16 2026 8:47 AM

చెరుకు సరఫరాకురైతుల ససేమిరా

కేన్‌ కమిషనరేట్‌కు

తాకిన నిరసన సెగ

● గోదావరి–గంగా కర్మాగారంలోమందగించిన క్రషింగ్‌

● సందిగ్ధంలో యాజమాన్యాలు

● టన్నుకు రూ.5 వేలు చెల్లించాలని ప్రతిపాదన

చెరుకు పంటకు గిట్టుబాటు ధర కల్పించే విషయమై యాజమాన్యాలు ఇప్పటివరకు తేల్చలేదు. అప్పటి వరకు ఉత్పత్తులను తరలించబోమని రైతులు భీష్మించుకుని కూర్చున్నారు. టన్నుకు రూ.5 వేలు చెల్లించాలని కోరుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో పంట దిగుబడులు పడిపోవడం, పెట్టుబడుల వ్యయం రెట్టింపు కావడంతో ప్రస్తుతం యాజమాన్యాలు ప్రకటించిన ధర ఏ మాత్రం గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు. – జహీరాబాద్‌

జిల్లాలో సుమారు 13 లక్షల టన్నుల చెరుకు ఉత్పత్తి కానుందనే అంచనా ఉంది. గిట్టుబాటు ధర చెల్లించే వరకు దిగివచ్చేది లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ చెరకును తరలించేది లేదని రైతులు చెబుతున్నారు. చక్కెర ధర ఆకాశాన్నంటినా యాజమాన్యాలు మాత్రం మొక్కుబడిగా ధర ప్రకటించి చేతులు దులుపుకుంటున్నాయని విమర్శిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. స్వల్పకాలిక పంటలను సాగు చేసుకునే రైతులు తమ కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్నారని చెబుతున్నారు. తమ కష్టాన్ని పరిగణలోకి తీసుకుంటే టన్నుకు రూ.6 వేలు ధర చెల్లించినా తక్కువే అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రైతులు చెరుకు తరలించే విషయంలో నిరాసక్తత చూపుతున్నారు.

సందిగ్ధంలో యాజమాన్యాలు

చెరుకు పంటకు గిట్టుబాటు ధరను చెల్లించే వరకు ఉత్పత్తులను తరలించబోమని రైతులు స్పష్టం చేస్తుండడంతో చక్కెర కర్మాగారాల యాజమాన్యాలు సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈనెల 1న రాయికోడ్‌లోని గోదావరి–గంగా కర్మాగారం క్రషింగ్‌ను ప్రారంభించింది. రోజుకు 3 వేల టన్నుల క్రషింగ్‌ సామర్థ్యం ఉన్నా, రైతులు చెరకు పంటను సరఫరా చేసేందుకు సుముఖంగా లేక పోవడంతో కర్మాగారంలో క్రషింగ్‌ మందగించింది. సగటున రోజుకు ఒక వెయ్యి టన్నులు కూడా క్రషింగ్‌ చేయలేని పరిస్థితి నెలకొంది. సంగారెడ్డిలోని గణపతి కర్మాగారం ఇప్పటికీ క్రషింగ్‌ను ప్రారంభించలేదని రైతులు పేర్కొంటున్నారు. 11వ తేదీన క్రషింగ్‌ ప్రారంభించేందుకు సిద్ధపడినా తాము చెరుకును సరఫరా చేసేందుకు సిద్ధంగా లేనందునే క్రషింగ్‌ను ప్రారంభించలేదని చెబుతున్నారు.

కర్ణాటకలో పెరిగిన ధర

పక్కనే ఉన్న కర్ణాటకలోని కర్మాగారాల యాజమాన్యాలు ధరను పెంచినట్లు రైతులు చెబుతున్నారు. గుల్బర్గా, హుమ్నాబాద్‌ ప్రాంతాల్లో రైతులు చేపట్టిన ఆందోళనల ఫలితంగా యాజమాన్యాలు దిగివచ్చి ధరను పెంచాయి. టన్నుకు రూ.4,400 నుంచి రూ.4,700 వరకు ధర ఇచ్చేందుకు సిద్ధపడ్డాయి. బీదర్‌ జిల్లాకు చెందిన రైతులు ఈనెల 16వ తేదీన గిట్టుబాటు ధర కోసం ఆందోళనలను చేపట్టేందుకు నిర్ణయించారు. పక్కనే ఉన్న కర్ణాటక యాజమాన్యా లు ఇచ్చే ధరను పరిగణలోకి తీసుకుని జిల్లాలోని యాజమాన్యాలు గిట్టుబాటు ధరను చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

చెరుకు పంటకు గిట్టుబాటు ధరను నిర్ణయించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు, రైతు సంఘాల నాయకులు, ఆయా పార్టీల నేతలు హైదరాబాద్‌లోని కేన్‌ కమిషనరేట్‌కు తరలివెళ్లారు. టన్నుకు రూ.5 వేలు చెల్లించేలా చూడాలని కేన్‌ కమిషనర్‌ నర్సిరెడ్డిని కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. గిట్టుబాటు ధర విషయంలో జరుగుతున్న జాప్యం పట్ల నిరసన వ్యక్తం చేశారు. సెట్విన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గిరిధర్‌రెడ్డి ఎమ్మెల్యే మాణిక్‌రావు, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ శివకుమార్‌, ఎమ్మెల్సీ కోదండరాం, ఆయా పార్టీల నాయకులు, రైతులు కలిసి చెరుకుకు గిట్టుబాటు ధర చెల్లించేలా చూడాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement