రామచంద్రాపురం(పటాన్‌చెరు): మండల పరిధి తెల్లాపూర్‌లోని ఓ మెడికల్ దుకాణంపై గురువారం రాష్ట్ర సేఫ్ డ్రగ్స్ విభాగం అధికారులు దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన ట్రామాడోల్ క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. తెల్లాపూర్ పరిధిలోని శ్రీగణేశ్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్‌పై రాష్ట్ర సేఫ్ డ్రగ్స్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ పి.రాము, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు ఎం.చంద్రశేఖర్, ఎన్. రవికిరణ్ రెడ్డిల బృందం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ట్రామాడోల్ క్యాప్సూల్స్ అక్రమంగా విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దుకాణంలోని 6,368 క్యాప్సూల్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.58,904 ఉంటుందని అధికారులు తెలిపారు. ట్రామాడాల్ క్యాప్సూల్స్ నొప్పి నివారణకు వినియోగించే ఓపియాయిడ్ ఔషధమని, ఇది అలవాటుగా మారే స్వభావం కలిగి ఉంటుందని అధికారులు తెలిపారు.


