బైరాన్‌పల్లి.. వీరుల తల్లి | - | Sakshi
Sakshi News home page

బైరాన్‌పల్లి.. వీరుల తల్లి

Sep 17 2026 8:35 AM | Updated on Sep 17 2026 8:35 AM

భారత సర్కార్‌ను కదిలించిన రజాకార్ల దుశ్ఛర్యలు జలియన్‌ వాలాబాగ్‌ను మించిన నరమేధం హామీలను విస్మరించిన నాయకులు నేడు తెలంగాణ విమోచన దినం

రజాకార్లకు ఎదురు నిలబడిన పల్లెలు

మహ్మదాపూర్‌ గుట్టల్లో

వీరమరణం

ఆర్య సమాజ్‌ ర్యాలీపై కాల్పులు

అసువులు బాసిన పోరాట యోధులు

ఆ నెత్తుటి గాథకు నేటికీ 79 ఏళ్లు

మద్దూరు(హుస్నాబాద్‌): రజాకార్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన నేల.. నిజాం నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచిన మట్టి మనుషుల కోట అది. నాటి హైదరాబాద్‌ సంస్థానంలో రజాకార్లు సాగించిన అరాచకాలపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఘనత సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని బైరాన్‌పల్లి గ్రామస్తులది. తెలంగాణ సాయుధ పోరాటానికి అసలైన బీజం వేసింది బైరాన్‌పల్లి పోరాటమేనని చరిత్ర చెబుతోంది. కాగా ఈ ఘటన జరిగి నేటికీ 79 ఏళ్లు అవుతోంది. కానీ నేటికి ఆ వీరత్వానికి దక్కాల్సిన గుర్తింపు దక్కకపోవడం, పాలకులు ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితం కావడంపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

శిస్తు కట్టం.. ఎదురు తిరుగుతాం

ఆ నాడు రజాకార్లు శిస్తుల పేరిట పల్లెలను దోచుకుంటూ, ప్రజలను బిక్కుబిక్కుమంటూ బతికేలా చేశారు. కానీ బైరాన్‌పల్లి గ్రామస్తులు మాత్రం ధిక్కార స్వరం వినిపించారు. శిస్తు కట్టం.. మీ అన్యాయాన్ని సహించం అంటూ ఎదురు తిరిగారు. అంతేకాదు.. దూల్మిట్ట, లింగాపూర్‌ తదితర గ్రామాల్లో రజాకార్లు దోచుకెళ్తున్ను సొమ్మును బైరాన్‌పల్లి పోరాట యోధులు ధైర్యంగా అడ్డుకొని, సాధ్వీనం చేసుకొని మళ్లీ తిరిగి ప్రజలకు పంచారు. ఈ వీరోచిత ఘటనే తెలంగాణ పల్లెల్లో పోరాట స్ఫూర్తిని రగిల్చింది. గ్రామాల్లోని ప్రజలు సైతం తమ వద్ద ఉన్న వ్యవసాయ పనిముట్లనే ఆయుధాలుగా మార్చుకొని రజాకార్లకు ఎదురొడ్డారు.

118 మంది బలి.. కదిలిన ఢిల్లీ

బైరాన్‌పల్లి ప్రజల తిరుగుబాటును జీర్ణించుకోలేని రజాకార్ల ముఠా ఆ గ్రామంపై కక్ష గట్టింది. ఖాసీం రజ్వీ నేతృత్యంలోని రజాకార్ల సైన్యం రెండు పర్యాయాలు గ్రామంపై విరుచుకుపడి నరమేధానికి పాల్పడింది. ఏకంగా బైరాన్‌పల్లి, కూటిగల్‌ గ్రామాల్లో 118మందిని పొట్టన బెట్టుకున్నారు. జలియన్‌ వాలాబాగ్‌ దురంతాన్ని మించిన ఈ రాక్షసకాండ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వార్త నాటి భారత హోంశాఖ మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ను కదిలించింది. దీంతో ఆయన నిజాం రాజుపై సైనిక చర్య ఆపరేషన్‌ పోలోకు ఆదేశించారు. భారత సైన్యం రంగంలోకి దిగడంతో నిజాం రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ తోకముడిచి లొంగిపోయాడు. ఫలితంగా సెప్టెంబర్‌ 17, 1948న హైదరాబాద్‌ సంస్థానానికి విమోచనం లభించింది.

హామీల వర్షం.. ఆచరణ శూన్యం

ప్రతి ఏటా ఆగస్టు ,సెప్టెంబర్‌ వస్తే చాలు.. బైరాన్‌పల్లికి రాజకీయ నాయకుల తాకిడి పెరుగుతుంది. అమరవీరుల స్తూపం, బురుజు వద్ద అమరవీరులకు నివాళులర్పించి వేదికలపై హామీల వర్షం కురిపించి వెళ్లడం నాయకులకు ఆనవాయితీగా మారింది. గతంలో గవర్నర్‌ తమిళిసై, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు వచ్చి హామీలిచ్చారు. అలాగే ప్రస్తుతం మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, అలాగే బీజేపీ నేత లక్ష్మణ్‌, కాంగ్రెస్‌ నేత విజయశాంతి వచ్చి హామీల వర్షం కురిపించారు. అలాగే మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్‌భాస్కర్‌ గ్రామంలో అమరవీరులకు పిండ ప్రదానం చేశాడు తప్ప.. గ్రామానికి చేసిందేమీ లేదు. గ్రామాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారుస్తామని, నాటి పోరాటంలో పాల్గొన్న సమరయోధులకు పెన్షన్లు ఇప్పిస్తామని , గ్రామంలో అమరధామం నిర్మిస్తామని ఎన్నో ఆశలు కల్పించారు. కానీ నేటికీ ఏ ఒక్క హామీ ఆచరణకు నోచుకోలేదు. నాయకుల హడివిడి తప్పా.. గ్రామానికి, సమరయోధుల కుటుంబాలకు ఎలాంటి న్యాయం జరగడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వీరుల రక్తం చిందిన నేల

హుస్నాబాద్‌ రూరల్‌: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తున్న కమ్యూనిస్టులు.. ఇండియన్‌ యూనియన్‌లో కలవాలని నిజాం నిరంకుశ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని పోరాటంను ఉధృతం చేశారు. హుస్నాబాద్‌ ప్రాంతంలో కొనసాగిన దొరలు, భూస్వాముల పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా కరీంనగర్‌ జిల్లా పొలంపల్లికి చెందిన అనభేరి ప్రభాకర్‌రావు, సిరిసిల్ల జిల్లా లక్ష్మీపూర్‌కు చెందిన సింగిరెడ్డి భూపతిరెడ్డి దళాలు ఈ ప్రాంత ప్రజలను చైతన్యం చేస్తూ వెట్టి చాకిరి విముక్తి కోసం వారిని ఐక్యం చేశారు.

1948 మార్చి 14న అటవీ సమీపంలోని మహ్మదాపూర్‌కు అనభేరి ప్రభాకర్‌రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి దళాలతో గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి సాయుధ దళాలు వచ్చాయని సమాచారం అందుకున్న రజాకారులు భోజనం చేసే సమయంలోనే వారిపై కాల్పులు జరిపారు. భూషణ గట్టుకు వెళ్తుండగానే రజాకార్లు జరిపిన కాల్పుల్లో 12 మంది సాయుధులు వీరమరణం పొందారు. ఈ ఘటన జరిగిన ఆరు నెలలకు నిజాం నవాబు లొంగిపోవడంతో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. వీరమరణం పొందిన వీరుల జ్ఞాపకార్థం గుట్ట కింద అనభేరి ప్రభాకర్‌రావు, సింగిరెడ్డి భూపతి రెడ్డి సమాధులు నిర్మించి ప్రతి ఏటా సెప్టెంబర్‌ 17న, మార్చి 14న కమ్యూనిస్టులు నిర్వహించే సభలకు ప్రజలు పార్టీలకు అతీతంగా హాజరై వీరులకు నివాళులర్పించి ఆ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు.

మెదక్‌జోన్‌: రజాకార్ల ఆకృత్యాలకు బలైన ప్రాంతాల్లో మెతుకుసీమ ఒక్కటి. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం రాగా అప్పటి హైదరాబాద్‌ సంస్థానంలో ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని నిజాం పాలించటంతో ఈ ప్రాంతాన్ని భారత్‌లో చేరకుండా సతంత్రంగా ఉండాలనే నిరంకుశత్వానికి తెరలేపాడు. వారి హింసను వ్యతిరేకించిన మెదక్‌ పట్టణానికి చెందిన అన్నదమ్ములు బట్టి కిష్టయ్య, వెంకయ్యలతో పాటు కేవల్‌ కిషన్‌, బళ్లాల బాబయ్య, సిల్వర్‌ రాజయ్య, గంగారాం, ఈశ్వరయ్య, దస్తగిరితో పాటు మొత్తం 80 మంది యువత బాలభారతి మండలి పేరుతో సంఘం పెట్టి రజాకార్ల ఆకృత్యాలను అడ్డుకోవటం, దాడులకు ప్రతిదాడులు చేసి నిలువరింపజేశారని నేటికీ పట్టణ ప్రజలు చెబుతున్నారు.

సుభాష్‌ చంద్రబోస్‌తో జట్టు కట్టిన చోళ లింగయ్య

స్వాతంత్య్రం కోసం భీకరంగా పోరాటాలు జరుగుతున్న నేపథ్యంలో సుభాష్‌చంద్రబోస్‌ ఆజాద్‌ హింద్‌ స్థాపనకు పిలుపునివ్వగా, మెదక్‌ పట్టణానికి చెందిన చోళ లింగయ్య ఆర్మీ ఎయిర్‌ఫోర్స్‌ విభాగంలో గ్రౌండ్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. బోస్‌ పిలుపు మేరకు ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయనతో జతకట్టి ఆంగ్లేయులతో పోరాటం చేసినట్లు చరిత్ర చెబుతోంది. విమాన ప్రమాదంలో బోస్‌ మరణించటంతో ఆయన తిరిగి మెదక్‌కు చేరుకున్నాడు. అప్పుడు ఈ ప్రాంతంలో రజాకార్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్న బాలభారతి మండలిలో సభ్యుడిగా చేరిన లింగయ్య నాటు తుపాకులు, బాంబుల తయారీని స్వయంగా చేసి రజాకార్లపై తిరగబడ్డారు. 1947 ఆగస్టు 15న, జాతీయ జెండాను పటేల్‌కుంటలో మండలి సభ్యులు ఎగురవేశారు. దీంతో పోలీసులు లింగయ్యతో పాటు బాలభారతి మండలి సభ్యులను అరెస్టు చేసి 7 నెలలు ఔరంగాబాద్‌ జైలులో పెట్టారు. అనంతరం సర్దార్‌ పటేల్‌ మిలిటరీ యాక్షన్‌తో తెలంగాణకు విముక్తి కలిగాక జైలు నుంచి విడుదలయ్యారు

ఉద్యమాల గడ్డ.. రాయికోడ్‌

రాయికోడ్‌(అందోల్‌): నిజాం సైన్యం, రజాకార్ల మూకలు, భూస్వాములు జలగల్లా ప్రజలను దోచుకుంటున్న రోజుల్లో తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమంలో మేము సైతం అంటూ రాయికోడ్‌ వాసులు కదిలారు. పోరాటానికి మద్దతుగా కొనసాగిన ఆర్యసమాజ్‌ ర్యాలీని గ్రామానికి ఆహ్వానించారు. ర్యాలీకి నిజాం సర్కారులోని హద్నూర్‌ అమీన్‌సాబ్‌ అనుమతివ్వలేదు. నిషేధాజ్ఞలు లెక్కచేయకుండా కాలిన కడుపులు, మండుతున్న గుండెలతో తెగింపునకు సిద్ధమై ర్యాలీ ప్రారంభించి కొనసాగించారు. ర్యాలీ గ్రామంలోని గౌని ప్రాంతానికి చేరుకోగానే ఉద్యమకారులు, రజాకార్లకు మధ్య ఘర్షణ జరిగింది. రజాకార్లు ర్యాలీలోని ఉద్యమకార్లపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 14 మంది గ్రామస్తులు అమరులయ్యారు. ర్యాలీలో పాల్గొన్నందుకు 8 మందికి నిజాం ప్రభుత్వం జైలు శిక్ష విధించింది. అనంతరం రజాకార్లు రెచ్చిపోయి గ్రామంలోని ఇళ్లలో ఉన్న ధనం, ధాన్యాన్ని లూటీ చేశారు. ఉద్యమ కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేసి ఇళ్లకు నిప్పంటించగా ఇళ్లు, సామగ్రి, పంట ఉత్పత్తులు కాలిబూడిదయ్యాయి. అప్పటి ఉద్యమకారులు, అమరులైన వారి జ్ఞాపకాలు గ్రామస్తుల మదిలో ఇప్పటికీ మెదులుతూనే ఉంటాయి.

ప్రభుత్వాల చిన్నచూపు

గొప్ప చరిత్ర కలిగిన వీరబైరాన్‌పల్లి గ్రామానికి నాటి ఉమ్మడి ఆంధ్రపదేశ్‌, స్వరాష్ట్రంలో గ్రామానికి గుర్తింపు దక్కడం లేదు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి గ్రామానికి సరైన గుర్తింపును ఇవ్వాలి.

–చల్లా చంద్రారెడ్డి

(సమరయోధుడు), బైరాన్‌పల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement