ఐడియా అదిరే.. | - | Sakshi
Sakshi News home page

ఐడియా అదిరే..

Sep 17 2026 8:35 AM | Updated on Sep 17 2026 8:35 AM

రోడ్డు పాడవకుండా చర్యలు

నిజాంపేట(మెదక్‌): రోడ్ల పరిరక్షణకు మండల కేంద్రంలో ఓ ట్రాక్టర్‌ డ్రైవర్‌ వినూత్నంగా ఆలోచించాడు. ఫుల్‌ కేజ్‌వీల్స్‌తో ఉన్న ట్రాక్టర్‌ను రోడ్డుపై నేరుగా నడపకుండా మరో ట్రాక్టర్‌ సహాయంతో తీసుకెళ్లాడు. కేజ్‌వీల్స్‌తో ట్రాక్టర్‌ను నడిపితే రోడ్డు దెబ్బతినే అవకాశం ఉందని భావించాడు. ఈ నేపథ్యంలో రోడ్లను కాపాడాలనే ఉద్దేశంతో డ్రైవర్‌ తీసుకున్న ఈ నిర్ణయం స్థానికుల దృష్టిని ఆకర్షించింది. కాగా డ్రైవర్‌ను పలువురు అభినందించారు.

నీళ్లు అనుకుని

పురుగుల మందుతాగి..

వృద్ధురాలు మృతి

వర్గల్‌(గజ్వేల్‌): మానసిక స్థితి సరిగాలేని వృద్ధురాలు నీళ్లు అనుకుని పురుగుల మందు తాగి మృతి చెందింది. ఈ విషాదకర ఘటన బుధవారం మండలంలోని శేరిపల్లిలో చోటు చేసుకుంది. గౌరారం ఎస్‌ఐ ఆరోగ్యం వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయిని పోచమ్మ(70)కు మతి స్థిమితం సరిగా లేదు. దీనికి తోడు కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఉదయం ఆమె పొలం వద్దకు వెళ్లి నీళ్లు అనుకుని అక్కడ డబ్బాలో ఉన్న పురుగుల మందు తాగింది. ఇంటికి వచ్చి అస్వస్థతకు గురైంది. కుమారుడు స్వామి ఆమె వద్ద పురుగుల మందు వాసన గమనించి ఆరా తీయగా పొలం వద్ద డబ్బాలో నీళ్లు తాగినట్లు చెప్పింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది.

చిరుత దాడిలో లేగదూడ మృతి

తుప్రాన్‌: మండలంలోని ఇస్లాంపూర్‌ తండా పరిధిలో చిరుతపులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. మంగళవారం రాత్రి తండాకు చెందిన రైతు లంబాడి రాజు పొలంలో రోజువారీగా పశువులను కట్టేసి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి చిరుతపులి లేగదూడను దారుణంగా చంపి తినింది. బుధవారం ఉదయం పొలానికి వెళ్లిన రాజుకు లేగదూడ మృతి చెంది ఉండటం, చిరుత దాడి చేసిన ఆనవాళ్లు కనిపించడంతో సర్పంచ్‌ సంతోష్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మృతి చెందిన లేగదూడను, అడుగులను పరిశీలించి అది చిరుతపులి దాడేనని ప్రాథమికంగా నిర్ధారించారు. తండాతో పాటు పరిసర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లకూడదని అధికారులు సూచించారు.

ఓపెన్‌ యూనివర్సిటీలో నూతన కోర్సులు

సిద్దిపేటఎడ్యుకేషన్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ సిద్దిపేట ప్రాంతీయ కేంద్రానికి రెండు నూతన కోర్సులు మంజూరైనట్లు కోఆర్డినేటర్‌ డాక్టర్‌ శ్రద్ధానందం చెప్పారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఎంఎస్సీ జాగ్రఫీ పీజీ కోర్సుతో పాటు ఎంఎస్సీ జియో ఇన్ఫర్మాటిక్స్‌ ఒక సంవత్సరం డిప్లమా కోర్సులు మంజూరయ్యాయన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ కోర్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. డిమాండ్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు యూనివర్సిటీ నూతన కోర్సులను ప్రవేశ పెడుతుందన్నారు. ఈనెల 30లోగా అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సీటీ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

పోక్సోకేసులో నిందితుడికి కఠిన కారాగార శిక్ష

సిద్దిపేటఅర్బన్‌: బాలికను వేధించిన కేసులో నిందితుడికి కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ సిద్దిపేట ఒకటవ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు తీర్పునిచ్చింది. సిద్దిపేట రూరల్‌ సీఐ సీహెచ్‌. విద్యాసాగర్‌ వివరాల ప్రకారం.. సిద్దిపేట అర్బన్‌ మండలం నాంచారుపల్లికి చెందిన మండెల గణేశ్‌(26) 2021లో బాలికను వేధించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి కోర్టులో ఛార్జీషీట్‌ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 1,01,000 జరిమానా విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement