సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రెహమాన్
సంగారెడ్డి ఎడ్యుకేషన్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసులు కమ్యూనిస్టులేనని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రెహమాన్ పేర్కొన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా సంగారెడ్డిలోని నారాయణ రెడ్డి కాలనీలో ర్యాలీ నిర్వహించి బుధవారం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ భూమి, భుక్తి, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హిందూ, ముస్లింల పోరాటంగా చరిత్రను వక్రీకరించడం బాధాకరమన్నారు. పోరాటం ఫలితంగా దొరల, భూస్వాముల 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచారని గుర్తు చేశారు. సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు వెంకట్రాజ్యం, కాశీనాథ్, సంతోష్‌కుమార్ గుప్తా, ఫెరోజ్, రజియా, యాదమ్మ, మల్లమ్మ, స్వప్న పాల్గొన్నారు.


