సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నిషేధిత జాబితా 22ఏలో సంగారెడ్డి జిల్లాకు సంబంధించి 318 అపార్టుమెంట్లు, 1,799 నివాసాలు ఉన్నట్లు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. మొత్తం 2,117 ప్రైవేటు స్థిరాస్తులు ఈ జాబితాలో ఉన్నట్లు తేల్చింది. పటాన్‌చెరు నియోజకవర్గంలో బీహెచ్‌ఈఎల్ కాలనీల్లో 1,146 ఇళ్లు, సందిగూడెం కాలనీలో 250 ఇళ్లు, బోన్సాయ్‌కాలనీలో 182 నివాసాలు, బండ్లగూడ కాలనీలో 112, దుర్గా కాలనీలో 56, ముత్తంగి కాలనీలో 53 ఇళ్లు ఈ జాబితాలో ఉన్నట్లు గుర్తించారు. అలాగే శ్రీరాంనగర్ కాలనీలో ఏకంగా 259 అపార్టుమెంట్లు ఈ నిషేధిత జాబితాలో ఉన్నాయి. శ్రీనగర్ కాలనీలోనూ 59 అపార్టుమెంట్లు 22ఏలో ఉన్నట్లు నిర్ధారించారు.
డ్రోన్ టెక్నాలజీపై కలిసి పనిచేయనున్న రెండు సంస్థలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అటానమస్ నావిగేషన్ సిస్టమ్‌పై పరిశోధన చేస్తున్న ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన టీహాన్ సంస్థతో ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ (ఏపీడీసీ) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు సమక్షంలో ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయని ఐఐటీ హైదరాబాద్ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. టీహాన్ సంస్థ ఏపీలో డ్రోన్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడం, డ్రోన్ సిటీ అభివృద్ధికి సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది. డ్రోన్ ఆర్‌డీ, యూఏవీ ప్లాట్‌ఫాంలు, సెన్సార్‌లు, పేలోడ్‌లు వంటి అంశాలపై ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. ఈ సందర్భంగా ఐఐటీహెచ్ డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీ.ఎస్.మూర్తి మాట్లాడుతూ..బలమైన డ్రోన్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి ప్రభుత్వం, విద్యా సంస్థలు, పరిశ్రమలు, ఆవిష్కరణలు సమాజానికి ఎంతో అవసరమన్నారు. ఆధునిక డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధికి, పరిశోధకులు, స్టార్టప్‌లు, పరిశ్రమలకు కొత్త అవకాశాలను సృష్టించే సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర
సంగారెడ్డి టౌన్: జాతీయ లోక్ అదాలత్‌లో 3,625 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర వెల్లడించారు. శనివారం జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్‌అదాలత్‌లో ఆమె పాల్గొని మాట్లాడారు. కక్షిదారులు తమ వివాదాలను పరస్పర అంగీకారంతో సత్వరంగా పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు ఇరుపక్షాలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఉచిత న్యాయ సహాయం అందించడం, ప్రజలకు సత్వర న్యాయం అందించడం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు అధికారులు, సిబ్బంది, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు.


