సంగారెడ్డి జోన్/సంగారెడ్డి క్రైమ్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే నవరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లావ్యాప్తంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా జెడ్పీ కార్యాలయంలో శనివారం శాంతి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గణపతి నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని, ప్రజలు ఒకరి మత సంప్రదాయాలను మరొకరు గౌరవిస్తూ మత సామరస్యాన్ని కాపాడాలన్నారు. నిర్వాహకులు తెలంగాణ పోలీస్ పోర్టల్‌లో మండపం వివరాలు, నిమజ్జనం తేదీ, నిమజ్జనానికి వెళ్లే మార్గం తదితర వివరాలను ముందస్తుగా నమోదు చేయాలని సూచించారు. వినాయక ప్రతిష్ఠాపన కోసం ఏర్పాటు చేసే మండపాలను రహదారులపై నిర్మించకుండా, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భద్రతా దష్ట్యా ప్రతీ మండపం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో లేదా ఏదైనా సమాచారం ఉన్నప్పుడు డయల్–112కు లేదా సంబంధిత పోలీస్ స్టేషన్‌కు వెంటనే సమాచారం అందించాలని వెల్లడించారు. కార్యక్రమంలో డీఎస్పీ సత్తయ్యగౌడ్, తహస్దీలార్ జయరామ్, తోపాజి అనంత కిషన్, మున్సిపల్ కౌన్సిలర్స్, మున్సిపల్ శాఖ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ అధికారులు, గణేశ్ మండప నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ పరితోశ్ పంకజ్


