భెల్‌ను సందర్శించిన రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
రామచంద్రాపురం(పటాన్‌చెరు): బీహెచ్‌ఈఎల్ పరిశ్రమను రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం సందర్శించారు. భెల్ చౌరస్తాలోని డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ విగ్రహానికి, భెల్ టౌన్‌షిప్‌లోని డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనకు భెల్ ఈడి వై.శ్రీనివాస్‌రావు, జీఎంలు జె.ఉమామహేశ్వరరావు, నందు, సంధ్యాకర్‌లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బెల్ ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పలు అంశాలను కార్మికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం భెల్ యాజమాన్యంతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.
రైస్ మిల్లులపై
సోదాలు నిలిపివేయాలి
తెలంగాణ రైస్ మిల్లు అసోసియేషన్ సమావేశం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న సోదాలు నిలిపివేయాలని తెలంగాణ రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య కన్వేన్షన్ హాల్‌లో శనివారం తెలంగాణ రైస్ మిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి రాష్ట్రంలోని 33 జిల్లాల కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...రాష్ట్రంలోని రైస్ మిల్లులకు వరి ధాన్యం కేటాయించకపోవడం దారుణమన్నారు. మూడు రోజులుగా కలెక్టర్, పట్టణాల్లో, జిల్లా కేంద్రాల్లో రైస్ మిల్లర్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
9.60కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం
2014 నుంచి 2024 వరకు రాష్ట్రంలో 9.70 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ప్రభుత్వం రైస్ మిల్లులకు ఇవ్వగా 9.60కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యంను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చామన్నారు. కొందరు మిల్లర్లు చేసిన అవినీతికి అందరిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. అవినీతి పరులను రైస్ మిల్ అసోసియేషన్ నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది 75లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఇవ్వగా 51లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందించనున్నట్లు తెలిపారు. అందుకు గాను డిసెంబర్ 31 వరకు సమయం ఇవ్వాలన్నారు.


