ఆరోగ్య తెలంగాణ కోసం
అవగాహన కల్పిస్తున్నాం
అంగన్‌వాడీల్లో నెల పాటు పోషణ మాసోత్సవాలు
పౌష్టికాహారంపై అవగాహన కల్పించడంతో పాటు అంగన్‌వాడీల ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పలు రకాల పోషకాహారం అందిస్తూ ఐసీడీఎస్ ఆరోగ్య తెలంగాణ సాధనకు కృషి చేస్తుంది. తల్లి మంచి పౌష్టకాహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడని.. తద్వారా దేశానికి భావి భారతపౌరుడిని అందించగల్గుతామన్న మంచి లక్ష్యంతో పోషణ మాసోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
జిల్లాలో 1150 అంగన్‌వాడీ కేంద్రాలు
సిద్దిపేట జిల్లాలో దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాలలో మొత్తం ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల పరిధిలో 1150 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. టీచర్లు 1,059, ఆయాలు 860, గర్భిణులు 5,932, బాలింతలు 4,270, సున్నా నుంచి ఐదేళ్లలోపు పిల్లలు 66,508 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.
వచ్చే నెల 8 వరకు..
ఈ నెల 9న ప్రారంభమైన పోషణ మాసంను అక్టోబర్ 8 వరకు చేపడతారు. ఏ విధమైన ఆహారం తీసుకోవాలి? స్వయంగా తయారు చేసిన రకరకాల పౌష్టికాహారంను అందిస్తూ అంగన్‌వాడీల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
● మొదటి వారంలో ధాన్యాలు, చిరు ధాన్యాలు, ఆకుకూరలు, పళ్ల సమూహాల ప్రదర్శన, బొమ్మలతో అవగాహన కల్పిస్తారు. రెండో వారంలో అంగన్‌వాడీల నిర్వహణ కమిటీల ఏర్పాటు, తల్లి పాలు, ఆలన పాలనపై అవగాహన, మూడో వారంలో పిల్లల్లో స్వీయ అవగాహన, ఎదుగుదల ప్రోత్సాహానికి అద్దాల ఏర్పాటు, గర్భిణులు, బాలింతల ఇళ్ల సందర్శన, వైద్య సిబ్బందితో సహకారం అందించనున్నారు. నాలుగో వారం ప్రధానమంత్రి మాతృవందన యోజన, ప్యాకేజీ ఆహారంతో కలిగే నష్టాలను వివరిస్తారు. తల్లిదండ్రులు, మహిళా సంఘాలు, పంచాయతీ వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తారు.
ఆధునిక యుగంలోనూ పౌష్టికాహార లోపంతో మాతాశిశు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా గర్భిణులు సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడంతో అబార్షన్లు కావడం.. ప్రసవమయ్యే సమయంలో ఇబ్బందులు తలెత్తి తల్లీబిడ్డలు పురిట్లోనే మరణిస్తున్న ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం. పేద కుటుంబాల్లో ఆరోగ్యంపై అవగాహన లేకపోవడంతోనే ఈ సమస్యలకు దారి తీస్తున్నాయి. ఈ క్రమంలో మాతాశిశు మరణాలను నివారించడానికి ఆరోగ్య తెలంగాణ సాధించాలన్న సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోషణ మాసం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. – దుబ్బాక
పోషకాహార లోపంపై విస్తృత ప్రచారం
సిద్దిపేట జిల్లాలో
1150 అంగన్‌వాడీ కేంద్రాలు
సరైన అవగాహన లేక గర్భిణులు పోషకాహారం తీసుకోవడం లేదు. దీంతో పుట్టబోయే పిల్లలు అవయవ లోపాలు, తక్కువ బరువుతో పాటు చాలా రకాల అనారోగ్యంతో పుడుతున్నారు. పౌష్టికాహార లోపాలు లేకుండా భవిష్యత్తులో సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా విస్తృతంగా ప్రచారం చేపడుతున్నాం.
– శారద, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి
అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు, ఐదేళ్ల లోపు పిల్లలకు పోషకాహారం అందిస్తున్నాం. క్రమం తప్పకుండా వారి ఆరోగ్యాన్ని పరిక్షించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– సుజాత, అంగన్‌వాడీ టీచర్, దుబ్బాక


