మద్దూరు(హుస్నాబాద్): మండలంలో గాగిల్లాపూర్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ డ్రైవర్లు తుమ్మల గోపీ, వల్లపు అనిల్‌పై కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
తీవ్ర గాయాలు
దుబ్బాకరూరల్: విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్‌కు కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని హబ్సిపూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాలు.. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన జోరబొంతల రమేశ్ సబ్ స్టేషన్‌లో విద్యుత్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆన్ చేస్తున్న సమయంలో ప్రక్కన ఉన్న విద్యుత్ వైర్లు తగిలి షాక్ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. భారీ శబ్దం రావడంతో పొలాల వద్ద ఉన్న రైతులు గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు అక్కడికి చేరుకుని తీవ్ర గాయాలతో పడి ఉన్న రమేశ్‌ను అంబులెన్సులో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు.
మిరుదొడ్డి(దుబ్బాక): భూంపల్లి పీహెచ్‌సీలో కాలం చెల్లిన ఇంజక్షన్ విషయంలో తలెత్తిన వివాదంలో ఘర్షణ పడ్డ వైద్య సిబ్బందిపై జిల్లా ఉన్నతాధికారులు శుక్రవారం విచారణ చేపట్టారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాస్‌తో పాటు, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు వినోద్ బాబ్జీ, నిర్మల భూంపల్లి పీహెచ్‌సీని సందర్శించారు. ఇంజక్షన్ విషయంలో ఘర్షణ పడిన ఝాన్సీ, దీపికలను వేర్వేరుగా విచారించారు. తుది నివేదికల అనంతరం వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం పీహెచ్‌సీలోని మెడిసిన్ ల్యాబ్, స్టాక్ రూం, ఓపీ, రికార్డులను, కాలం చెల్లిన ఇంజక్షన్ల వివరాలపై ఆరా తీశారు. పీహెచ్‌సీకి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆదేశించారు.
సిద్దిపేటకమాన్: బ్యాంకు ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్ ఉద్యోగులు తెలిపారు. శుక్రవారం యూనియన్ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగికి పేస్కేల్‌కు అనుగుణంగా కేటగిరి వారీగా వేతనాలు చెల్లించాలన్నారు. బ్యాంకుల్లో పనిచేసే సిబ్బందికి బోనస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బ్యాంకుల ఉద్యోగులు పాల్గొన్నారు.
నిజాంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నిజాంపేటకు చెందిన జీడి చిన్న అంజాగౌడ్ బైక్‌పై వెళ్తుండగా పాత బస్టాండ్ వద్ద వెనక నుంచి అతి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అంబులెన్స్‌లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజేశ్ తెలిపారు.
రోడ్డు దాటుతుండగా విద్యార్థిని..
చిన్నశంకరంపేట(మెదక్): రోడ్డు దాటుతున్న విద్యార్థిని కారు ఢీకొట్టగా గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. శుక్రవారం పాఠశాలకు వెళ్తున్న పదవ తరగతి విద్యార్థిని శ్వేత రోడ్డు దాటుతుండగా నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. గమనించిన స్థానికులు వెంటనే విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ రఘునందన్‌రావు దృష్టికి తీసుకెళ్లి విద్యార్థులు అండర్‌పాస్ ద్వారా పాఠశాలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు.


