నిమ్జ్‌ గ్రామాల్లో గందరగోళం! | - | Sakshi
Sakshi News home page

నిమ్జ్‌ గ్రామాల్లో గందరగోళం!

Aug 21 2026 9:44 AM | Updated on Aug 21 2026 9:44 AM

ఆ భూములేలా తీసుకుంటారు

జీపీల అధికారాలు టీజీఐఐసీ, ఎన్‌ఐసీడీఐటీలకు బదలాయింపు

ఈ మేరకు తీర్మానాలు చేసి పంపాలని సర్కారు ఆదేశాలు

వ్యతిరేకిస్తున్న సర్పంచ్‌లు, పాలకవర్గాలు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నిమ్జ్‌(జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి) గ్రామాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా గ్రామాల పాలకవర్గాలైన పంచాయతీల అధికారాలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్‌సీడీఐటీ (నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌, ఇంప్లిమెంటేషన్‌ ట్రస్ట్‌), టీసీఐఐసీ (తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ)లకు బదలాయించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయా గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేసి పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఎంపీడీఓలు, ఎంపీఓలు, గ్రామ కార్యదర్శులు కొన్ని చోట్ల గ్రామ సభలను నిర్వహిస్తున్నారు. అయితే ఈ అధికారాల బదలాయింపును ఆయా గ్రామాల సర్పంచులుగా పాలకవర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ మేరకు సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాల్‌కల్‌ మండలం హద్నూర గ్రామ పాలకవర్గం గురువారం గ్రామసభను నిర్వహించింది. తమ అధికారాలను బదలాయించేది లేదని తీర్మానం కూడా చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాలు ఇప్పుడు గ్రామాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

జహీరాబాద్‌ నిమ్జ్‌ స్మార్‌ సిటీలో భాగంగా తొలి విడతలో 3,245 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. ఈ భూములను కొందరు పెట్టుబడిదారులకు కేటాయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పెట్టుబడిదారులు తమ పరిశ్రమలను నెలకొల్పడానికి అనుమతులు, భవన నిర్మాణ క్లియరెన్స్‌లు ఇచ్చే అధికారం సంబంధిత గ్రామ పంచాయతీకి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం ఆయా గ్రామ పంచాయతీలకు ఉన్న ఈ అధికారాలను టీజీఐఐసీ, ఎన్‌సీడీఐటీలకు చెందిన ఉమ్మడి సంస్థకు బదిలీ అవుతాయి.

ఝరాసంగం మండలం బర్దిపూర్‌, చీలపల్లి, ఎల్గోయి. న్యాల్‌కల్‌ మండలం హద్నూర్‌, ముంగి, రుక్మాపూర్‌ గ్రామ పంచాయతీల అధికారాలు ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సంస్థకు బదిలీ కానున్నాయి. దీంతో ఈ గ్రామాల పరిధిలో ఎలాంటి నిర్మానాలు చేపట్టాలన్నా ఆయా గ్రామ పంచాయతీల అనుమతుల అవసరం ఉండదు.

జాబితాలో లేని సర్వే నంబర్ల ప్రస్తావన

తీర్మానాల కోసం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో భూసేకరణలో లేని సర్వే నంబర్లు కూడా ప్రస్తావించారు. ఈ ఉత్తర్వులకు అనుబంధంగా జారీ చేసిన ఎనాగ్జర్‌–2 లో భూసేకరణ జాబితాలో లేని సర్వే నంబర్లు కూడా ఉండటం కూడా ఆయా పంచాయతీలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకరించానికి ఓ కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇప్పటికే వేల ఎకరాలు సేకరించిన ప్రభుత్వం ఇకపై భూసేకరణ ఉండబోదని అధికారుల ప్రకటించాక కొత్త సర్వే నంబర్లు ఈ జాబితాలో ఉండటంతో సంబంధిత రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తమ భూములు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు.

ఈ విషయమై బాధిత రైతులు, గ్రామస్తులు న్యాల్‌కల్‌ మండల పరిషత్‌, రెవెన్యూ కార్యాలయాల్లో సంప్రదించగా.. తమకేమీ తెలియదని, ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలు మీకు పంపామని, మీరే చేసే తీర్మానాలను ప్రభుత్వానికి పంపుతామని అధికారులు దాటవేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. బాధిత రైతులు, గ్రామపంచాయతీల పాలకవర్గాల సందేహాలను నివృత్తి చేయాల్సిన అధికారులు తమకేదీ పట్టనట్లుగా వ్యవహరించడం పట్ల ఆయా గ్రామస్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): నిమ్జ్‌ ప్రాజెక్ట్‌ కోసం సేకరించిన భూములను కాకుండా ఎలాంటి సమాచారం లేకుండా ఇతర భూములు తీసుకోవడమేమిటనీ హద్నూర్‌ గ్రామ రైతులు అధికారులను ప్రశ్నించారు. గురువారం మండల పరిధిలోని హద్నూర్‌ పంచాయతీ ఆవరణలో పంచాయతీ పాలకవర్గం, రైతులతో అధికారులు సమావేశం నిర్వహించారు. నిమ్జ్‌ ఏర్పాటు కోసం ఇదివరకు సేకరించిన 543 ఎకరాలు కాకుండా మరో 943 ఎకరాలు సేకరించేందుకు నిర్ణయించడం ఏమిటనీ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ అధికారాలను టీజీఐఐసీకి అప్పగించవద్దని పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సర్పంచ్‌ ప్రవీణ్‌ కుమార్‌, పంచాయతీ కార్యదర్శి ధన్‌రాజ్‌, వార్డు సభ్యులు, రైతులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement