పటాన్‌చెరు టౌన్: ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించాలనే డిమాండ్‌తో గురువారం పటాన్‌చెరు డివిజన్‌లో విద్యాసంస్థల బంద్ చేపట్టినట్లు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శక్తి స్కీమ్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కళాశాలలకు నిధులు కేటాయించి బలోపేతం చేయాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు అర్జున్ మాట్లాడుతూ.. బంద్ విజయవంతానికి సహకరించిన విద్యార్థులు, అధ్యాపకులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో శాంసన్, విశాల్, సాయి, రమేష్ పాల్గొన్నారు.
సంగారెడ్డి: లింగ నిర్ధారణను అరికట్టడం అందరి బాధ్యత అని జిల్లా వైద్యాధికారి లలితాదేవి అన్నారు. గురువారం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లింగ నిర్ధారణను అరికట్టడం, పీసీ అండ్ పీఎన్‌డీటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో స్కానింగ్ కేంద్రాల పనితీరు, రికార్డుల నిర్వహణ, గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలపై సమగ్రంగా చర్చించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళా శిశు సంరక్షణ, బాలికల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్ నాగనిర్నాల, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సతీశ్
నర్సాపూర్ రూరల్: నీటి లభ్యతకు అనుగుణంగా రైతులు పంటలు సాగు చేసుకోవడం అలవర్చుకోవాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సతీశ్ సూచించారు. గురువారం మండలంలోని లింగాపూర్ రైతు వేదికలో వ్యవసాయశాఖ, ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి పంట సాగుకు నీటి వినియోగం ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా పెసర, మినుము, శనగ, మొక్కజొన్న, నువ్వులు, వేరుశనగ వంటి తక్కువ నీటి వీటి వినియోగంతో పండే పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలతో పెట్టుబడితో పాటు నీటి వినియోగం కూడా తక్కువగా ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో ఏఓ దీపిక, ఏఈఓలు దుర్గా ప్రసాద్, తేజస్విని, లావణ్య, రైతులు పాల్గొన్నారు.
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని తునికి వద్ద గల డాక్టర్ రామానాయుడు విజ్ఞానజ్యోతి గ్రామీణాభివృద్ధి విద్యసంస్థ, వ్యవసాయ కళాశాలలో వ్యవసాయం, విత్తన సాంకేతికతలో ఆరునెలల వృత్తివిద్యతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు, మార్కెటింగ్‌పై ఏడాది ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ దేవెందర్‌రెడ్డి, ఫీల్ మేనేజర్ జగదీశ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయ విద్యకు పదో తరగతి పాస్, మార్కెటింగ్ విద్యకు ఇంటర్మీడియెట్ పాస్ అయిన యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. శిక్షణ పూర్తయ్యే వరకు క్షేత్రస్థాయిలో పంటలసాగు, బోధన, భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. సెప్టెంబర్ 30 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. వివరాలకు 9381959372, 8466942278 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
చేగుంట(తూప్రాన్): మండల కేంద్రంలోని చేగుంట బాలికల గిరిజన గురుకుల స్పోర్ట్స్ పాఠశాలలో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐదో తరగతిలో ఎస్టీలకు 35, ఎస్సీలకు 5, బీసీలకు 5, ఓసీలకు 5, మైనార్టీలకు 5, స్పోర్ట్స్ కోటాలో 1 ఆరో తరగతిలో ఎస్టీలకు 27, ఏడో తరగతిలో ఎస్టీలకు 3, ఎనిమిదో తరగతిలో ఎస్టీలకు 3 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈనెల 30, 31న చేగుంట గిరిజన గురుకుల పాఠశాలలో ఎంపిక ప్రకియ నిర్వహిస్తామన్నారు.


