● మహిళా సంఘాల నుంచి ముక్కు పిండి వసూలు
● అధికారుల పర్యవేక్షణ లోపం
● విచారణకు పలువురి డిమాండ్
మహిళా సంఘాల బలోపేతం కోసం ప్రభుత్వం మంజూరు చేస్తున్న బ్యాంకు లింకేజీ లోన్లలో వీఓఏలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రుణం మంజూరు కావాలంటే ముందుగా ముడుపులు చెల్లించాలంటున్నారు. రూ.10 లక్షల రుణానికి ఒక లెక్క.. రూ. 20 లక్షలకు మరో లెక్క చొప్పున సభ్యుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
– హత్నూర(సంగారెడ్డి)
అధికారుల పర్యవేక్షణ లోపం మహిళా సంఘాలకు శాపంగా మారింది. మండలంలో 1,050 మహిళా స్వయం సహాయక గ్రూపులు ఉన్నాయి. ఇందులో సుమారు 800కు పైగా గ్రూపులు రూ.10 నుంచి రూ. 20 లక్షల వరకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాయి. ఇలా సుమారు రూ. 1,000 కోట్లకు పైగా మహిళా సంఘాల సభ్యులు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని లావాదేవీలు కొనసాగిస్తున్నారు. సుమారు 25 మహిళా గ్రూపులు సక్రమంగా రుణాలు చెల్లించక రూ.30 లక్షల వరకు బ్యాంకులకు బాకీ ఏర్పడ్డారు. బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను మహిళా సంఘాల నుంచి సక్రమంగా చెల్లించే బాధ్యత వీఓఏలదే. అయితే వీరు బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు రుణాలు ఇప్పించే సమయంలో రూ. లక్షకు రూ. 2 నుంచి 3 వేల వరకు, రూ. 20 లక్షల వరకు రుణం బ్యాంకు ద్వారా ఇప్పిస్తే రూ.5000 వరకు డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పాత తీర్మానాలు, సంతకాలు పూర్తిగా లేకున్నా అక్రమాలకు పాల్పడుతూ బ్యాంకుల ద్వారా కొంతమంది మహిళలకు రుణాలు సైతం ఇప్పిస్తున్నట్లు తెలిసింది.
ధాన్యం కొనుగోళ్లలో సైతం దోపిడీ
మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో 19 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో క్వింటాల్ ధాన్యం తూకం కోసం లారీ లోడింగ్ చేయడానికి హమాలీకి రూ. 48 నుంచి 50 రూపాయల వరకు రైతుల నుంచి ముక్కుపిండి తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తెచ్చిన టేకేదారులకు మాత్రం 39 రూపాయలు మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వీఓఏలు నిర్వాహకులకు ముట్టజెప్పి మిగితా డబ్బులను కాజేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో మిగిలిన లక్షలాది రూపాయలు సీసీలతో పాటు మండల స్థాయి ఏపీఎం వరకు ముడుపులు ముట్టినట్లు సమాచారం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేయించాలని పలువురు కోరుతున్నారు.


