పటాన్‌చెరు: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు, కీర్తిశేషులు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి 37వ జయంతిని జీఎంఆర్, జీవీఆర్ అభిమానులు, స్నేహితులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పటాన్‌చెరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జీఎంఆర్ యువసేన, జీవీఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 250 మందికి పైగా యువకులు రక్తదానం చేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆర్‌ఎంఓ శ్రీనివాస్ పర్యవేక్షించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పేద ప్రజలకు అన్నదానం నిర్వహించారు. బ్లాక్ ఆఫీస్ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో పలువురికి వైద్య పరీక్షలు చేశారు. అనంతరం అభిమానులు, సన్నిహితులు, యువసేన సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, యాదగిరి యాదవ్, విజయ్‌కుమార్, భిక్షపతి, రామచంద్రారెడ్డి, పృథ్వీరాజ్, గూడెం సంతోష్ రెడ్డి, సందీప్ రెడ్డి, అశోక్, వెంకటేశ్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.


