చేగుంట(తూప్రాన్): అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండల కేంద్రమైన మాసాయిపేట శివారులో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మాసాయిపేట మండలం పులిగుట్ట తండాకు చెందిన మలోతు మున్నీ(40) కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం కూరగాయలు అమ్మడానికి తండా నుంచి వెళ్లింది. శనివారం మాసాయిపేట శివారులోని బంగారమ్మ అలయ సమీపంలో మహిళ మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలు పులిగుట్ట తండా వాసిగా గుర్తించి బాధిత కుటుంబీకులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో మద్యం సీసాలు ఉన్నాయని, కావాలనే మున్నీని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని తండావాసులు ఆరోపిస్తున్నారు. భర్త వసురాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
పటాన్‌చెరు టౌన్: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మహంకాళి దేవస్థానం సమీపంలో శుక్రవారం ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటం స్థానికులు గుర్తించి, అంబులెన్స్‌లో పటాన్‌న్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుడు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటాయని, మృతుడు బ్లాక్–చెక్ షర్ట్ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలన్నారు.
చికిత్స పొందుతూ కార్మికుడు..
పటాన్‌చెరు టౌన్: చికిత్స పొందుతూ కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్‌లోని పార్థసారథి నగర్‌కు చెందిన వెంకటేశ్వర్లు(48) 13 ఏళ్లుగా రుద్రారంలోని ఎంఎస్‌ఎన్ కంపెనీలో ఫిట్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 11న కంపెనీలో విధులు నిర్వహిస్తున్న సమయంలో వేడినీటి పైపువాల్‌ను విప్పుతుండగా, ఒక్కసారిగా ఒంటిపై పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే హైదరాబాద్‌లోని అపోలో డీఆర్‌డీవో కంచన్‌న్‌బాగ్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, తుప్పు పట్టిన యంత్రాలతో పనులు చేయించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మృతుడి కుమారుడు వెంకట శ్రీచరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


