జహీరాబాద్ టౌన్: జనాభాలో సగం ఉన్న మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని కోల్ ఇండియా కంపెనీ మాజీ చైర్మన్ పీఎం. ప్రసాద్ పేర్కొన్నారు. వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సర్వీసెస్( వికాస్), కోల్ ఇండియా కంపెనీ ఆర్థిక సహాయంతో జహీరాబాద్ నియోజకవర్గంలోని 370 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మెషీన్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శనివారం పస్తాపూర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅథితిగా హాజరై ప్రసాద్ మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా కంపెనీ సహకారంతో వికాస్ సంస్థ మహిళలకు తోడ్పాటు అందించడం అభినందనీయమన్నారు. కుట్టు మెషీన్లను సద్వినియోగం చేసుకుని కుటుంబ పోషణకు అండగా ఉండాలని సూచించారు. హయత్‌నగర్ సివిల్ జడ్జి, మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ ఫర్హీన్ దండా మాట్లాడుతూ మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. ఇప్పటి వరకు సుమారు 1600 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మెషీన్లు పంపిణీ చేశామని వికాస్ సంస్థ చైర్మన్ కొత్తకాపు లక్ష్మారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్ పర్సన్ శిరీషరెడ్డి , ప్రాజెక్టు కోఆర్డినేటర్ కొత్తకాపు సురేందర్‌రెడ్డి, కౌన్సిలర్ శ్రీధర్‌రెడ్డి, సంస్థ డైరక్టర్లు రావినర్సింహారెడ్డి, సుగుణాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
కోల్ ఇండియా కంపెనీ
మాజీ చైర్మన్ ప్రసాద్
370 మందికి కుట్టు మెషీన్ల పంపిణీ


