పటాన్‌చెరు టౌన్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను తక్షణమే విరమించుకోవాలని, లేనిపక్షంలో గుణపాఠం తప్పదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ హెచ్చరించారు. దేశవ్యాప్త ’జైల్ భరో’ పిలుపులో భాగంగా సోమవారం పట్టణంలోని పీఎఫ్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం కార్యాలయం ముందు బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి పన్నెండేళ్లు గడుస్తున్నా.. ఒరిగిందేమీ లేదని విమర్శించారు. దశాబ్దాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను తుంగలో తొక్కి, నాలుగు లేబర్ కోడ్స్‌ను తీసుకొచ్చి కార్మికులను బానిసలుగా మారుస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా రైతులు చేపట్టిన ఉద్యమానికి తలొగ్గిన కేంద్రం నల్ల చట్టాలను రద్దు చేసినట్లే.. లేబర్ కోడ్స్‌ను కూడా రద్దు చేసేవరకు కార్మిక లోకం వెనకడుగు వేయదని స్పష్టం చేశారు. అలాగే, నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు, యువకులు సాగించిన పోరాటాల ఉధృతికి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఉపాధి కూలీల పొట్టకొట్టేలా ఉన్న ’వీబీ జీ రాంజీ’ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు మానిక్ మాట్లాడుతూ విపరీతంగా పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనం రూ. 42 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సీనియర్ నాయకులు వాజిద్ అలీ, జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, అర్జున్, జిల్లా కమిటీ సభ్యులు రాజు, శాంత్ కుమార్, సుధాకర్, శ్రీధర్, నాయకులు రామ్మోహన్ రెడ్డి, గంగాధర్, ఏడుకొండలు, భరత్ పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్


