న్యాల్‌కల్ (జహీరాబాద్): ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ సైదా నాయక్ సర్పంచ్‌లకు సూచించారు. మండల పరిధిలోని హద్నూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జహీరాబాద్ రూరల్ సీఐ హన్మంతు, ఎస్‌ఐ దోమ సుజిత్‌తో కలిసి ఆయా గ్రామాల సర్పంచ్‌లతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాల్‌కల్ మండలం కర్ణాటక సరిహద్దులో ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలపై నిఘా పెట్టాలన్నారు. నేరాలను అరికట్టేందుకు ప్రతి గ్రామంలో ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాలని కోరారు. నేరాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. వాటి ఏర్పాటుకు అయ్యే ఖర్చు కోసం గ్రామ పంచాయతీ నిధులను వినియోగించడంతో పాటు, దాతల ద్వారా విరాళాలు సేకరించాలని సూచించారు. ఈ సమావేశంలో సర్పంచ్‌లు శ్రీకాంత్ రెడ్డి, అశ్విన్ పాటిల్, జనార్దన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, సుధాకర్, సుకుమార్, రమేష్, నాయకులు ప్రవీణ్ కుమార్, యాదవ రావు పాటిల్, మోహన్ రెడ్డి, నగేష్, షబ్బీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
డీఎస్పీ సైదా నాయక్ సూచన


