హత్నూర(సంగారెడ్డి): కరువు మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో చినుకు జాడ లేకుండా పోయింది. ఏటా ఈ సమయానికి పచ్చని పైర్లతో కనువిందు చేసే సాగు భూములు ఎడారిని తలపిస్తున్నాయి. వర్షాలు లేక చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. అయితే బోర్ల కింద మాత్రం రైతులు జోరుగా వరి నాట్లు వేస్తున్నారు. అధికారులు వద్దంటున్నా.. రైతన్నలు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం హత్నూర మండలంలో 25 వేల ఎకరాల్లో వరి సాగు చేసేందుకు రైతులు ముమ్మరంగా పనులు కొనసాగిస్తున్నారు. కేవలం పత్తి 4,000 ఎకరాలు, 200 ఎకరాల్లో కంది, 100 ఎకరాల్లో జొన్నసాగుకు రైతులు ప్రస్తుతం సిద్ధమై సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. మండలంలోని 38 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 250 వరకు చెరువు, కుంటలు ఉన్నాయి. వర్షాలు కురవకపోవడంతో ఏ ఒక్క చెరువు కుంటల్లో చుక్క నీరు చేరలేదు. అయినప్పటికీ రైతులు మాత్రం వరి నాట్లు వేస్తున్నారు. వరి నాట్లు వేసిన తర్వాత భూగర్భజలాలు అడుగంటి బోర్ల నుంచి నీరు రాకపోతే వేసిన పంటలు ఎండిపోయే అవకాశం ఉంది. పెట్టిన పెట్టుబడులు సైతం నష్టపోయే ప్రమాదం ఉంది. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే విషయమై మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వర్షాలు తక్కువ పడతాయని, రైతులు వరినాట్లు వేయవద్దని ప్రచారం చేస్తున్నామని తెలిపారు. అయినా కొన్ని గ్రామాల్లో వరిపైనే రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. చేతికొచ్చిన వరి పంట నీరు లేక ఎండిపోతే నష్టపోయే ప్రమాదం ఉందని అవగాహన కల్పిస్తున్నాం.
కమ్ముకున్న కరువు
వెలవెలబోతున్న నీటి వనరులు
బోర్లను నమ్ముకుని వరి నాట్లు


