ఆర్భాటమే.. ఆచరణేదీ? | - | Sakshi
Sakshi News home page

ఆర్భాటమే.. ఆచరణేదీ?

Jul 16 2026 7:24 AM | Updated on Jul 16 2026 7:24 AM

● బేకరీ, కన్ఫెక్షనరీ కోర్సులకు తీసుకోని దరఖాస్తులు ● నిథమ్‌ బీబీఏ, ఎంబీఏకు సైతం ఇదే పరిస్థితి ● కవేలిలోని హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల దుస్థితి

● బేకరీ, కన్ఫెక్షనరీ కోర్సులకు తీసుకోని దరఖాస్తులు ● నిథమ్‌ బీబీఏ, ఎంబీఏకు సైతం ఇదే పరిస్థితి ● కవేలిలోని హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల దుస్థితి

జహీరాబాద్‌: గ్రామీణ యువతీ యువకులకు వృత్తి పరమైన నైపుణ్యాలు పెంపొందించి, వారి కాళ్లపై వారు నిలబడేలా చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ (ఎస్‌ఐహెచ్‌ఎం) సంస్థ వ్యవహారం ఆర్భాటానికే పరిమితమైందనే విమర్శలున్నాయి. కోహీర్‌ మండలంలోని కవేలి గ్రామ శివారులో గల హోటల్‌ మేనేజ్‌మెంట్‌ భవనంలో మే 18వ తేదీన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో అడ్మిషన్లు, నైపుణ్యాభివృద్ధి కోర్సులను ప్రారంభించారు. ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్‌ సహకారంతో నూతనంగా ప్రవేశపెట్టిన ఈ కోర్సులను మంత్రి ప్రారంభించారు. నిథమ్‌లో బీబీఏ, ఎంబీఏ అడ్మిషన్లు లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఇది ప్రారంభోత్సవానికి పరిమితం అయింది. అప్పటి నుంచి భవనం మూతపడి ఉంది. దాదాపు రెండు నెలలు కావొస్తున్నా సిబ్బందిని సైతం నియమించలేదు. కళాశాలకు పూర్వ వైభవం తీసుకువస్తామని చెప్పడంతో పాటు రూ.5 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కళాశాల ఆధునికీకరణ, కొత్త కోర్సుల కోసం ఈ నిధులను కేటయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రభుత్వం స్పందించి కళాశాలను పునఃప్రారంభించాలని స్థానికులు, యువత కోరుతున్నారు.

టూరిజం హోటల్‌ మూతపడడంతో..

రెండు దశాబ్దాల క్రితం టూరిజం హోటల్‌ కోసం భవనం నిర్మించారు. టూరిజం శాఖకు చెందిన బస్సులన్నీ ఇదే హోటల్‌ వద్ద ఆగుతుండేవి. క్రమంగా పర్యాటకులు తగ్గడం, టూరిజం శాఖ బస్సులు రాకపోవడంతో హోటల్‌ మూతపడింది. దీంతో భవనాన్ని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు వీలుగా 2012 డిసెంబర్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. మూడేళ్ల బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, ఏడాదిన్నర డిప్లొమా కోర్సులను ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు ప్రత్యేక ప్రవేశ పరీక్ష రాసి ప్రవేశం పొందేవారు. ప్రభుత్వాల నుంచి ఈ కోర్సులకు ఉపకార వేతనాలు, బోధనా రుసుములు అందక పోవడంతో విద్యార్థుల ఫీజులపైనే కళాశాల నిర్వహణ చేపట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేయడంతో ప్రవేశాలు లేక విద్యాసంస్థ మూతపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement