కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి జోన్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (సర్)కు రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. బుధవారం ఓటరు జాబితా సవరణపై కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీలకు ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ వందశాతం పూర్తయ్యిందన్నారు. ఇప్పటివరకు 55 శాతం ఫారాల డిజిటైజేషన్ పూర్తి చేసినట్లు చెప్పారు. నారాయణఖేడ్‌లో 73 శాతం, ఆందోల్‌లో 65 శాతం, జహీరాబాద్‌లో 61 శాతం, సంగారెడ్డిలో 54 శాతం, పటాన్‌చెరులో 35 శాతం డిజిటైజేషన్ పూర్తయిందన్నారు. నిర్ణీత సమయంలో డిజిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లాలో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. బూత్ లెవల్ ఏజెంట్లను చైతన్యపరిచి బీఎల్‌ఓలకు సహకరించేలా చూడాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, ఆర్డీఓ రాజేందర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా సందేహాలు తీర్చుకునేందుకు జిల్లావ్యాప్తంగా హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. నియోజకవర్గాలతో పాటు మండల కేంద్రాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా అధికారులను నియమించినట్లు వివరించారు.


