జిన్నారం(పటాన్‌చెరు): జిన్నారం, గుమ్మడిద ల పట్టణాల్లో 132/33 కేవీ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిన్నారం, బొంతపల్లి, దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, శివానగర్, సోలక్‌పల్లి ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు.
సంత ప్రారంభం
జహీరాబాద్: మండలంలోని హోతి(బి) గ్రామంలో బుధవారం వారాంతపు సంతను ఎమ్మెల్యే మాణిక్‌రావు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సంతలతో రైతులు పంట అమ్ముకునే సౌలభ్యం కలుగుతుందన్నారు. అంతే కాకుండా ప్రజలకు తాజా కూరగాయలు తక్కువ ధరలకు లభించే అవకాశం ఉంటుందన్నారు. వారాంతపు సంతను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ మచ్చేందర్, మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు నారాయణ, నాయకులు వెంకటేశం, గోవర్ధన్‌రెడ్డి, మోహన్, వెంకటేష్, భీంరావునాయక్ పాల్గొన్నారు.
యానిమల్ బర్త్ కంట్రోల్
సెంటర్‌కు శునకాలు
నారాయణఖేడ్: ఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల బెడదను తగ్గించేందుకు మున్సిపల్ అధికారులు వీధి కుక్కలను ప్రత్యేక బృందాలతో పట్టించి సంగారెడ్డి సమీపంలోని కందిలో గల యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌కు తరలిస్తున్నారు. మూడు రోజులుగా 50 వరకు శునకాలను ప్రత్యేక బృందాలు పట్టి తరలించారు. వాటిని అక్కడ బర్త్ కంట్రోల్ చర్యలు చేపట్టి తిరిగి ఖేడ్‌కు తీసుకువస్తామని శానిటరీ అధికారి శ్రీనివాస్ తెలిపారు.
ఖేడ్ డిపో తనిఖీ
నారాయణఖేడ్: ఖేడ్ ఆర్టీసీ డిపోను హైదరాబాద్ జోన్ ఈడీ కుష్రుష్‌ఖాన్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన డిపో పనితీరు, రికార్డులు, ఆదాయం ప్రయాణికులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. అనంతరం డిపోకు సంబంధించిన ఐదెకరాల భూమి అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. ఈ అంశాలను ఆర్టీసీ ఎండీకి నివేదించనున్నట్లు చెప్పారు. ఆయన వెట డిప్యూటీ ఆర్‌ఎంలు బీవీ రావు, మధుసూదన్, డీఎం సుబ్రహ్మణ్యం ఉన్నారు.
ఉద్యమకారులకు
న్యాయం చేయాలి
మెదక్ కలెక్టరేట్: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారి సంక్షేమానికి కృషి చేయాలని జిల్లా జేఏసీ సమన్వయ కమిటీ నాయకులు కొండల్‌రెడ్డి, యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం కోసం కేశవరావు నాయకత్వంలో గుర్తింపు కమిటీ నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఇళ్లు లేని వారికి 250 గజాల ప్లాట్ ఇవ్వాలన్నారు.
కార్మికులకు అండగా ఉంటా
రామచంద్రాపురం(పటాన్‌చెరు): ఇక్రిశాట్ అవుట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. బుధవారం రామచంద్రాపురంలోని ఆయన నివాసంలో ఇక్రిశాట్ అవుట్‌సోర్సింగ్ కార్మికులు ఆయనను కలిసి సమస్యలు వివరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాజమాన్యంతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి పాల్గొన్నారు.


