
సకల హంగులతో సిద్ధం
మెడికల్ కాలేజీ,
హాస్టల్ సముదాయాలు
జిల్లాలో పూర్తయిన వైద్య కళాశాల భవనాలు
● అందుబాటులోకి ఖరీదైన వైద్య సేవలు
● రేపు ప్రారంభించనున్న మంత్రి దామోదర
● హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
సంగారెడ్డి: పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. జిల్లా మెడికల్ కళాశాల భవనాలు పూర్తయ్యాయి. ఈ భవన సముదాయాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం ప్రారంభించనున్నారు. గతంలో సరైన భవనాలు లేకపోవడంతో ఇబ్బందుల మధ్యే బోధన, వైద్య సదుపాయాలు కొనసాగాయి. 500 పడకల జిల్లా ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన, క్రిటికల్ కేర్ యూనిట్, కేన్సర్ రోగుల ప్రత్యేక వార్డును ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
జిల్లా ఆస్పత్రికి శంకుస్థాపన
సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి భవనాలు ఏళ్ల క్రితం నిర్మించినవి కావడంతో శిథిలమయ్యాయి. వాటి స్థానంలో కొత్తవి నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. ఇక్కడ 300 పడకలతో జిల్లా జనరల్ ఆస్పత్రి, 150 పడకలతో మాతా శిశు ఆరోగ్య కేంద్రాలున్నాయి. వాటి స్థానంలో 500 పడకలతో భవనాలు నిర్మించనున్నారు. వైద్య కళాశాలకు మంజూరైన నిధుల నుంచి రూ. 273.40 కోట్లను ఆస్పత్రి నిర్మాణానికి వెచ్చించనున్నారు. రేపు ఆస్పత్రి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
50 పడకలతో క్రిటికల్ కేర్
50 పడకల క్రిటికల్ కేర్ భవనాన్ని రూ.23.70 కోట్లతో నిర్మించారు. అందులో ఖరీదైన వైద్య పరికరాలను సిద్ధం చేశారు. ఇక నుంచి కార్పొరేట్‌కు దీటుగా వైద్యం అందిస్తామని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళికృష్ణ పేర్కొన్నారు.
కళాశాలకు రూ.510 కోట్లు..
జిల్లా ఆస్పత్రి ఆవరణలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు 2022లో రూ.510 కోట్లు మంజూరయ్యాయి. ఇటీవలే రెండంతస్తుల భవనం పనులు పూర్తయ్యాయి. కాలేజీలో ప్రస్తుతం మూడో బ్యాచ్ కొనసాగుతోంది. విద్యార్థులు, వైద్యులు, సిబ్బంది కోసం వేర్వేరుగా వసతి గృహ భవనాలు కూడా నిర్మించారు. ఇక విద్యార్థుల కష్టాలు తీరనున్నాయి.
కేన్సర్ రోగుల కోసం
కేన్సర్ రోగులకు ఇకనుంచి మెరుగైన సేవలు అందనున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 13 చోట్ల ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా పేరిట వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేన్సర్ అనుమానితులను హైదరాబాద్‌లోని ఎంఎన్ ఆస్పత్రికి పంపిస్తున్నారు. ఇక నుంచి ఇక్కడే వైద్యం అందించేలా 20 పడకలతో వార్డును ఏర్పాటు చేశారు.
భవనాల వివరాలు
ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణంలో భాగంగా రెండో విడతలో ఆర్‌అండ్‌బీ శాఖ రూ.156 కోట్ల నిధులతో మెయిన్ బ్లాక్(జీ+2), బాలుర హాస్టల్ (జీ+7), బాలికల హాస్టల్(జీ+8), బాలుర రెసిడెంట్ హాస్టల్(జీ+2), ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ క్వార్టర్స్ జీ+3, నూతన మార్చురీ భవనాలు నిర్మించారు. వీటన్నింటిని గురువారం మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభిస్తారు.
మంత్రి కృషితో అందుబాటులోకి
వైద్యశాఖ మంత్రి దామోదర కృషితోనే మెడికల్ కాలేజీ భవనాలు పూర్తయ్యాయి. ఇక నుంచి రోగులకు మెరుగైన సేవలు, విద్యార్థులకు నాణ్యమైన బోధన వసతి అందనుంది. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది సమష్టి కృషితో మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి చేస్తాం.
– జయప్రకాశ్ రావు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్