
‘మహిళా శక్తి’ బలోపేతం
హుస్నాబాద్‌రూరల్: పల్లెల్లో మహిళా శక్తిని బలోపేతం చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో సెర్ప్ అధికారులు నూతనంగా మహిళా సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధులను సంఘాల నుంచి తొలగించిన అధికారులు మళ్లీ వారి వివరాలు సేకరించి వృద్ధుల సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు.
జిల్లాలో ఇప్పటికే 18,267 మహిళా సంఘాల్లో 1,94,210 మంది సభ్యులు ఉండగా వీరికి బ్యాంకుల నుంచి లింకేజీ ఇప్పించి స్వయం ఉపాధి కల్పిస్తున్నారు. వృద్ధులు 108 సంఘాల్లో 10,085 మంది, వికలాంగులు 200 సంఘాల్లో 1502 మంది, కొత్తగా 318 మహిళా సంఘాల్లో 3,181 మంది, మరో 2,647 మందిని ఇతర గ్రూపుల్లో చేర్పించగా మొత్తం 17,415 మంది సభ్యులు చేరారు. వీరికి తోడు 2,400 మందితో 240 కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేశారు. దీంతో మహిళా సంఘాల్లో చేరిన మహిళల సంఖ్య 2,14,025కు చేరింది.
కిశోర బాలికల సంఘాలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు సెర్ప్ అధికారులు గ్రామాల్లోని 15 నుంచి 18 ఏళ్లున్న బాలికలను కిశోర బాలికల సంఘాలుగా ఏర్పాటు చేస్తున్నారు. వారికి యుక్త వయస్సులో వచ్చే మార్పులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థికాభివృద్ధిపై అవగాహన కల్పించి రెండేళ్ల తర్వాత బ్యాంకుల నుంచి లింకేజీ ఇప్పించి స్వయం ఉపాధి కల్పించనున్నారు. ప్రతి నెల గ్రూపుల్లో పొదుపు చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క గ్రూపునకు ఎన్‌ఆర్‌ఎల్‌ఎం ద్వారా రూ.15వేల మ్యాచింగ్ గ్రాంటును అందించనున్నారు.
వృద్ధుల సంఘాలు
గతంలో 60 ఏళ్లు నిండిన మహిళలను స్వశక్తి సంఘాల నుంచి తొలగించారు. ఇప్పుడు ప్రభుత్వం మహిళలకు చీరలు, ప్రతి నెల అభయహస్తం కింద రూ.2,500 చెల్లిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయడానికి వృద్ధుల సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం అందించే ఆసరా ఫించన్లు కూడా వయస్సు పైబడిన వారికి అందించడానికి సంఘాలు కీలక పాత్రను పోషించనున్నాయి. ప్రతి నెల రూ.50 పొదుపు చేయించి, మ్యాచింగ్ గ్రాంటు రూ.15వేలు మంజూరు చేయించనున్నారు.
కిశోర బాలికలు, వృద్ధుల సంఘాలు ఏర్పాటు
జిల్లా వ్యాప్తంగా డేటా సేకరణ
ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధిపై అవగాహన
వృద్ధులకు పథకాల అమలు బాధ్యతలు
ఆర్థిక శక్తిగా నిలుపడానికి
గ్రామాల్లో మహిళలకు ఆర్థిక అభివృద్ధిపై అవగాహన కల్పించి, సంఘాలను ఏర్పాటు చేస్తున్నాం. కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేసిన రెండేళ్ల తర్వాత వారికి బ్యాంకుల ద్వారా వ్యాపార నిమిత్తం రుణాలను ప్రభుత్వం అందించనుంది.
–బి.తిరుపతి, ఏపీఎం, హుస్నాబాద్

‘మహిళా శక్తి’ బలోపేతం