వయోజన విద్యకు ఉల్లాస్‌ | - | Sakshi
Sakshi News home page

వయోజన విద్యకు ఉల్లాస్‌

Sep 4 2025 8:42 AM | Updated on Sep 4 2025 8:42 AM

వయోజన

వయోజన విద్యకు ఉల్లాస్‌

కల్హేర్‌(నారాయణఖేడ్‌): డ్వాక్రా మహిళా సంఘాల్లో ఉన్న నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా ఉల్లాస్‌ (అండర్‌ స్టాండింగ్‌ లైఫ్‌ లాంగ్‌ లెర్నింగ్‌ ఫర్‌ ఆన్‌ ఇన్‌ సొసైటీ) పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ప్రతీ మహిళ అక్షర జ్ఞానం కలిగి ఉండాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాయి. విద్యాశాఖ, సెర్ప్‌ ఉమ్మడి భాగస్వామ్యంతో కొనసాగనుంది. ఉల్లాస్‌ కింద తరగతులు ప్రారంభించేందుకు ప్రభుత్వం నుంచి రేపో, మాపో ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది.

సామాజిక సాధికారతలో భాగంగా చదువురాని వారందరికీ చదవడం, రాయడం నేర్పించడమే ఉల్లాస్‌ పథకం ప్రధాన లక్ష్యం. మహిళా సంఘాల్లో ఉన్న సభ్యుల్లో 50 శాతం మంది మాత్రమే సంతకం చేస్తున్నారని, మిగిలిన వారు వేలిముద్ర వేస్తున్నారన్న సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంది. దీంతో వయోజన మహిళలకు చదువు నేర్పించడమే కాకుండా మధ్యలో బడి మానేసిన వారిని సైతం గుర్తించి నేరుగా ఓపెన్‌న్‌ పది, ఆసక్తి ఉంటే ఓపెన్‌ ఇంటర్‌,న్‌డిగ్రీ వరకు చదివిస్తారు. ఆ తర్వాత వారికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌, టెక్నికల్‌ కోర్సులు నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. బ్యాంకింగ్‌ రంగంలో ఆర్థిక క్రమశిక్షణ, పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలను నేర్పిస్తారు.

నిరక్షరాస్యుల గుర్తింపు

డీఆర్‌డీవో, సెర్ప్‌ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న మహిళా సంఘాల్లోని నిరక్షరాస్యుల సంఖ్యను వీవోఏల ద్వారా గుర్తించారు. నిరక్షరాస్యులు, మధ్యలో బడి మానేసిన వారిని గుర్తించి నివేదిక అందజేశారు. సంగారెడ్డి జిల్లాలో 55,371, మెదక్‌ జిల్లాలో 33,750 , సిద్దిపేట జిల్లాలో 41,153 మంది మహిళలను గుర్తించారు. ఇప్పటికే పథకానికి సంబందించిన విధి విధానాలను సెర్ప్‌ అధికారులు, సిబ్బందికి సమగ్రంగా వివరించారు. దాదాపు జిల్లా, మండల స్థాయిలో శిక్షణనిచ్చారు.

చదువు చెప్పే బాధ్యత వలంటీర్లకు

15 నుంచి 20 మంది చొప్పున గ్రూపులను ఏర్పాటు చేస్తారు. మహిళా సంఘాల్లో అక్షరాస్యులైన వారిని వలంటీర్లుగా ఎంపిక చేసి నిరక్షరాస్యుల గ్రూపులను కేటాయించి వారికి చదువు చెప్పిస్తారు. గ్రూపులో ఉన్న సభ్యులకు చదవడం, రాయడం వచ్చే వరకు చదువు చెప్పే బాధ్యత వలంటీర్లకు అప్పగించారు. విద్యాశాఖ పుస్తకాలతోపాటు ఉపాధ్యాయుల ద్వారా సహకారం అందించనున్నారు. తల్లి చదవడం ద్వారా ఆ కుటుంబంలో వెలుగు నిండుతుంది. తద్వారా బడికి వెళ్లే పిల్లల సంఖ్య పెరగడంతోపాటు డ్రాపౌట్‌ తగ్గి బాల్య వివాహాలపై అవగాహన పెరుగుతుంది. గ్రామంలో అక్షరాస్యులు ఉంటే అన్నిరంగాల్లో అభివృద్ధిలో పయనించేందుకు దోహదపడుతుంది.

చదవడం, రాయడం నేర్పించడమే లక్ష్యం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల

ఆధ్వర్యంలో ప్రారంభం

డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో

నిరక్షరాస్యుల గుర్తింపు

ఉమ్మడి జిల్లాలో

1,30,274 మంది గుర్తింపు

మహిళలకు మంచి అవకాశం

నిరక్షరాస్యులకు ఉల్లాస్‌ పథకం మంచి అవకాశం. మహిళా సంఘాల్లో నిరక్షరాస్యుల వివరాలు సేకరించాం. నిరక్షరాస్యులతో పాటు బడి మధ్యలో మానేసిన వారికి, దివ్యాంగులకు సైతం చదవడం, రాయడం నేరిస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని నిరక్షరాస్యులైన మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలి.

– కె.వెంకట్‌రెడ్డి, వయోజన విద్య

డిప్యూటీ డైరెక్టర్‌, ఉమ్మడి మెదక్‌ జిల్లా

వయోజన విద్యకు ఉల్లాస్‌1
1/1

వయోజన విద్యకు ఉల్లాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement