
వర్గల్(గజ్వేల్): ఇంటి నుంచి వెళ్లిన యువతి అదృశ్యమైంది. గౌరారం ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పసుల మానస(19) మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినప్పటికీ ఆచూకీ దొరకలేదు. దీంతో బుధవారం యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాలేజీకి వెళ్లిన యువతి..
పటాన్‌చెరు టౌన్: కాలేజీకి వెళ్లిన యువతి అదృశ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం.. అమీన్‌పూర్‌కు చెందిన లక్ష్మి కూతురు నవనీత (17) పటాన్‌చెరు డివిజన్ పరిధిలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. ఈ క్రమంలో మంగళవారం కాలేజీకి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. కూతురి కోసం తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు.
అచ్చన్నపల్లిలో వ్యక్తి..
టేక్మాల్(మెదక్): వ్యక్తి అదృశ్యమైన ఘటన మండలంలోని అచ్చన్నపల్లిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజేశ్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మడ్డె సురేశ్ (26) అల్లాదుర్గం సర్కిల్ 108లో పని చేస్తున్నాడు. వారం క్రితం డ్యూటీ నిమిత్తం వెళ్లిన అతడు ఏడు రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. మంగళవారం భార్య సునీత ఎక్కడికి వెళ్లావు, ఇంటికి ఎందుకు రాలేదని ప్రశ్నించడంతో గొడవపడి ఇంటినుంచి వెళ్లిపోయాడు. పరిసర ప్రాంతాలతో పాటు బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు.