
ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దుర్మరణం
మృతుల్లో ఇద్దరు చిన్నారులు
రాంగ్‌రూట్‌లో దూసుకొచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్
భిక్కనూరు/బోనకల్: రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతుల్లో తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ హృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామం వద్ద ఎన్‌హెచ్ 44పై బుధవారం చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరడ్‌పల్లికి చెందిన మెరుగు కిషన్ (54) ఆదిలాబాద్ జిల్లా రణదీవ్‌నగర్‌లో చర్చి పాస్టర్‌గా పనిచేస్తుండగా, ఆయన తల్లిదండ్రులు కామా రెడ్డిలో ఉంటున్నారు.
కిషన్ తన కుమార్తె జాస్లీన్ (30)ను ఐదేళ్ల క్రితం ఖమ్మం జిల్లా ముష్టికుంటకు చెందిన ఆగ మని ప్రకాశ్‌కు ఇచ్చి వివాహం చేశాడు. ప్రకాశ్ చింతకాని మండలం చిన్న మండవలో పాస్టర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు జోయల్ ప్రకాశ్ (4), జాడ్సన్ (3 నెలలు). కామారెడ్డిలో ఉంటున్న తన నానమ్మ, తాతయ్య వద్దకు జాస్లీన్ తన ఇద్దరు కుమారులతో కలిసి కొద్ది రోజుల క్రితం వచ్చింది. కిషన్ సైతం తన తల్లి దండ్రుల వద్దకు వచ్చాడు. జాస్లీన్ తన చిన్న కుమారుడు జాడ్సన్‌కు టీకా వేయించేందుకు భిక్కనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆశ వర్కర్‌గా పనిచేస్తున్న తమ బంధువు వద్దకు తండ్రి, పెద్ద కుమారుడితో కలిసి ఎలక్ట్రిక్ స్కూటర్‌పై బయల్దేరింది. వారి వాహనం జంగంపల్లి వద్దకు చేరుకోగానే రాంగ్‌రూట్‌లో అతివేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొట్టింది.
దీంతో నలుగురు రోడ్డుపై పడిపోయారు. కిషన్, జాస్లీన్ అక్కడి కక్కడే మృతి చెందగా, చిన్నారులు జోయల్ ప్రకాశ్, జాడ్సన్‌ను కామారెడ్డి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు ఘటనాస్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ రాజిరెడ్డిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.